Ganja Smuggling Network | దర్జాగా గంజాయి దందా.. రైల్వే మార్గమే అడ్డాగా తరలింపు..

రాష్ట్రంలో గంజాయి మాఫియా రూటు మార్చింది. రోడ్డు మార్గంలో పోలీసు, ఎక్సైజ్ శాఖల నిఘా పెరగడతో స్మగ్లర్లు ఇప్పుడు రైల్వే మార్గాన్ని ‘సేఫ్ కారిడార్’గా మార్చుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Ganja Smuggling Network | రాష్ట్రంలో గంజాయి మాఫియా రూటు మార్చింది. రోడ్డు మార్గంలో పోలీసు, ఎక్సైజ్ శాఖల నిఘా పెరగడతో స్మగ్లర్లు ఇప్పుడు రైల్వే మార్గాన్ని ‘సేఫ్ కారిడార్’గా మార్చుకున్నారు.

అనుమానం రాకుండా, చెక్‌పోస్టుల భయం లేకుండా పెద్ద మొత్తంలో ఎండు గంజాయిని రైళ్ల ద్వారానే జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కామారెడ్డి జాతీయ రహదారి (Kamareddy National Highway)పై పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో సుమారు 3 క్వింటాళ్ల గంజాయి పట్టుబడడంతో ఈ కొత్త దందా వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లారీలు, డీసీఎంలు, కార్లలో రహస్య అరల్లో గంజాయి దాచి తరలించే స్మగ్లర్లు ఇప్పుడు పూర్తిగా పంథా మార్చారు. ఒడిశా, ఆంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి సేకరించిన ఎండు గంజాయిని కిలో, రెండు కిలోల ప్యాకెట్లుగా చేసి, టేపులతో ప్యాక్ చేసి సాధారణ ప్రయాణికుల లగేజీ మాదిరిగా రైలు ఎక్కిస్తున్నారు. ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లలోనూ ఈ తరలింపు జరుగుతోంది. సీట్ల కింద, బెర్తుల పైన, బాత్‌రూమ్‌ల సమీపంలో, లగేజీ కంపార్ట్‌మెంట్లలో ఎవరికీ అనుమానం రాకుండా దాచిపెడుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా వెళ్లే రైళ్లలో ఈ తరహా రవాణా ఎక్కువగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై వరకు గంజాయి చేరుతోంది.

Ganja Smuggling Network | వారంలో రెండుసార్లు..

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో గంజాయి దందా ఏ స్థాయిలో సాగుతోందో చెప్పేందుకు తాజా ఘటనలే నిదర్శనం. వారం రోజుల వ్యవధిలోనే రైల్వే పోలీసులు రెండుసార్లు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ స్మగ్లర్లలో ఏ మాత్రం భయం కనిపించడం లేదు. దొరికినా ఒకట్రెండు రోజులు ఆగి మళ్లీ యథావిధిగా దందా కొనసాగిస్తున్నారు. ‘క్యారియర్లు’గా యువతను, నిరుద్యోగులను వాడుకుంటున్నారు. ఒకసారి సరుకును గమ్యస్థానానికి చేరిస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తుండడంతో డబ్బుకు ఆశపడి పలువురు ఈ ముఠాలకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Ganja Smuggling Network | కొరవడిన నిఘా..

రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రతి బోగీని, ప్రతి లగేజీని తనిఖీ చేయడం సాధ్యం కావడం లేదు. కామారెడ్డి రైల్వే స్టేషన్​లో సిబ్బంది కొరత వేధించడం కూడా ఒక కారణమేనని తెలుస్తోంది. దీనినే ఆసరాగా చేసుకుని గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. రైలు ఎక్కితే మార్గమధ్యంలో ఎక్కడా తనిఖీలు ఉండవని, ఒకవేళ ఉన్నా తప్పించుకోవడం సులభమని స్మగ్లర్లు భావిస్తున్నారు. పైగా రైలు ప్రయాణం రిస్క్ కూడా తక్కువనే ఆలోచనతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

Ganja Smuggling Network | మూడు కేసులు..

కామారెడ్డి పట్టణం మీదుగా గంజాయి సరఫరా చేస్తున్న వాటి ముఠా ఆగడాలు ఇటీవల శృతిమించాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ నెల 9న కామారెడ్డి రైల్వే స్టేషన్​లో రైలులో అక్రమంగా తరలిస్తున్న 10 కిలోల గంజాయి పట్టుకోగా 20న 20 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు (Excise officers) పట్టుకున్నారు. 20వ తేదీన సాయంత్రం జాతీయ రహదారిపై పనస పండ్ల వాహనంలో గుట్టుగా తరలిస్తున్న 3.87 క్వింటాళ్ల భారీ గంజాయిని కామారెడ్డి పోలీసులు పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Ganja Smuggling Network | ప్రత్యేక నిఘా కొనసాగుతోంది

-ఎస్పీ రాజేష్ చంద్ర

గంజాయి అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతోంది. ఇప్పటికే ఆపరేషన్ కవచ్ పేరుతో ఎక్కడికక్కడ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్ సరఫరాతో యువత చెడుమార్గం వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. తల్లిదండ్రులు సైతం పిల్లలపై నిఘా పెట్టాలి.

ఇది కూడా చదవండి..: NEET Exam | ‘నీట్’కు నలుగురు విద్యార్థులు ఆలస్యం.. ప్రాధేయపడ్డా అనుమతించని అధికారులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *