Sarpanch Husband Interference | ‘ఆమె’ స్థానంలో దర్జాగా..! హద్దు మీరుతున్న కొందరు ‘సర్పంచ్ భర్తలు’

స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులగా ఎన్నికైన మహిళలు నామమాత్రంగా మారుతున్నారు. వారి కుటుంబ సభ్యులే ‘అంతా తామై’ పెత్తనం చెలాయిస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Sarpanch Husband Interference | స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులగా ఎన్నికైన మహిళలు నామమాత్రంగా మారుతున్నారు. వారి కుటుంబ సభ్యులే ‘అంతా తామై’ పెత్తనం చెలాయిస్తున్నారు. పంచాయతీ పాలనలో తమ ‘మార్క్’​ చూపిస్తున్నారు. అధికారిక సమావేశాల్లో దర్జాగా ఆసీనులవుతూ.. అధికారులకు ఆదేశాలు సైతం ఇస్తున్నారు. గ్రామానికి ఓ మహిళా సర్పంచ్​ ఉన్నదనే విషయాన్ని మైమరిపిస్తూ అసలు సిసలైన నేతలుగా చెలామణి అవుతున్నారు.

Sarpanch Husband Interference | డిచ్​పల్లి మండలంలో..

డిచ్​పల్లి మండలం (Dichpally Mandal)లో జాతీయ రహదారి పక్కనున్న ఓ గ్రామంలో మహిళా సర్పంచ్​ భర్త.. పంచాయతీ పాలనలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. పంచాయతీ పాలక వర్గ సమావేశంలో కూర్చుని ఆదేశాలు ఇస్తున్నాడు. ఏదైనా పని ఉంటే తన ఇంటికి వచ్చి కలవాలని సిబ్బందిపై అజమాయిషీ ప్రదర్శిస్తూ పెత్తనం చెలాయిస్తున్నాడు. తన మాట వినని సిబ్బందిపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడు. ఆ సర్పంచ్ భర్త వ్యవహార శైలిపై గ్రామస్థులు ఆగ్రహంతో ఉన్నారు.

Sarpanch Husband Interference | చట్టసభల్లో సగం… పాలనలో మాత్రం శూన్యం

ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. మహిళలు రాజకీయంగా ఎదగాలని, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ గ్రామాలను ప్రగతి పథంలో నడపాలనేది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అయితే మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో భర్త జోక్యం మితిమీరిందని కలెక్టర్ ఏకంగా మహిళా సర్పంచ్‌ను సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Sarpanch Husband Interference | నిజామాబాద్​ జిల్లాలోనూ..

నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 545 గ్రామ పంచాయతీలుండగా 249 మంది మహిళా సర్పంచులు ఎన్నికయ్యారు. ఇక్కడ మహిళలు పేరుకే సర్పంచులుగా… కానీ, తెర వెనుక, తెర ముందూ అంతా తామై నడిపిస్తోంది మాత్రం వారి భర్తలు, కుమారులే కావడం గమనార్హం. జిల్లాలోని మెజారిటీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సర్పంచుల పరిస్థితి కేవలం ‘రబ్బరు స్టాంపు’లకే పరిమితమైంది. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మహిళా సర్పంచుల కోసం కేటాయించిన అధికారిక కుర్చీల్లో కొందరు వారి భర్తలు దర్జాగా కూర్చుని హుకూం జారీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల భార్య కుర్చీ పక్కనే అంతకంటే పెద్ద కుర్చీ వేయించుకుని సమాంతర పాలన సాగిస్తున్నారు.

Sarpanch Husband Interference | తీర్మానాల్లో జోక్యం

గ్రామ పంచాయతీ తీర్మానాల రిజిస్టర్లలో సంతకాలు పెట్టడానికి మాత్రమే మహిళా సర్పంచులు కార్యాలయానికి వస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే భర్తలే సంతకాలను కూడా ఫోర్జరీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండల పరిషత్ సమావేశాలకు, జిల్లాస్థాయి రివ్యూ మీటింగ్‌లకు మహిళా సర్పంచులకు బదులుగా వారి భర్తలే హాజరవుతున్నారు. అధికారులు కూడా దీనిని చూసీచూడనట్లు వదిలేయడం ఈ సంస్కృతికి మరింత ఊతమిస్తోంది.

Sarpanch Husband Interference | పంచాయతీ సిబ్బందిపై వేధింపులు

సర్పంచుల భర్తల మితిమీరిన జోక్యంతో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, సఫాయి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘మేం మహిళా సర్పంచ్‌కు నివేదిక ఇచ్చేందుకు వెళ్తే, ఆమె భర్త నివేదిక లాక్కుని మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆయన చెప్పినట్లు వినకుంటే ఎమ్మెల్యేకు చెప్పి బదిలీలు చేయిస్తామని బెదిరిస్తున్నారు.’ అని కొందరు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక, గ్రామ నిధుల దుర్వినియోగం వంటి విషయాల్లో భర్తల మాటే శాసనంగా మారింది. గ్రామ సభల్లో మహిళా సర్పంచ్‌లను మూలన కూర్చోబెట్టి, మైక్ పట్టుకుని భర్తలే ప్రసంగాలు దంచేస్తున్నారు. సర్పంచుల భర్తల ఆగడాలపై పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారులకు అంతర్గతంగా ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

Sarpanch Husband Interference | ఇంటెలిజెన్స్​ నివేదికలు

మెదక్ జిల్లా పొలంపల్లి ఘటన నిజామాబాద్ జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. జిల్లాలోని పలు మండలాల్లో మహిళా సర్పంచుల భర్తల జోక్యంపై ఇంటెలిజెన్స్, పంచాయతీ రాజ్ శాఖ అంతర్గత నివేదికలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడైనా భర్తల పెత్తనం కనిపిస్తే సదరు మహిళా సర్పంచ్‌లను సస్పెండ్ చేయాలని భావిస్తున్నారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎన్నుకోబడిన ప్రతినిధి మాత్రమే విధులను నిర్వహించాలి. సర్పంచ్​ స్థానంలో ఇతరులు జోక్యం చేసుకుంటే అది చట్టవిరుద్ధం. జిల్లాలో ‘సర్పంచ్ పతి’ల పెత్తనానికి చెక్ పెట్టకపోతే.. మహిళా రిజర్వేషన్ల ఆశయం అభాసుపాలు కావడం ఖాయం. ఇప్పటికైనా కలెక్టర్, పంచాయతీ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి, క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్​లైన్​కు లీకేజీ.. నీటి సరఫరాకు అంతరాయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *