Brahmajivadi Bus | బ్రహ్మాజీవాడికి బస్సోచ్చింది.. ఊరంతా సంబరపడింది..

‘మన ఊరికి బస్సొచ్చిందట’ అనే ఒక్క మాటతో బ్రహ్మాజీవాడి గ్రామం మొత్తం మంగళవారం ఉదయం ఉప్పొంగిపోయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, తాడ్వాయి: Brahmajivadi Bus | ‘మన ఊరికి బస్సొచ్చిందట’ (RTC Bus) అనే ఒక్క మాటతో బ్రహ్మాజీవాడి గ్రామం మొత్తం మంగళవారం ఉదయం ఉప్పొంగిపోయింది. ‘ఒరేయ్ బావ.. మన ఊరుకు బస్సు వచ్చిందిరా’ అంటూ చుట్టాలకు, పక్కూరి వాళ్లకు ఫోన్లు చేసి మరీ సంబరపడ్డారు. తాడ్వాయి(Tadwai) మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామంలో మంగళవారం నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులివి.

Brahmajivadi Bus | తరాల నుంచి బస్సును చూడలేదు..

ఈ గ్రామం పుట్టి ఎన్నో తరాలు గడిచాయి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆర్టీసీ బస్సు చక్రం ఈ నేలను తాకలేదు. స్కూలుకు వెళ్లే పిల్లలైనా, కూరగాయలు అమ్ముకునే అవ్వలైనా, టౌన్​లో డాక్టర్​ను చూపించుకోవాలన్నా  2 కిలోమీటర్లు కాలినడకనే శరణ్యం. వర్షం వస్తే బురద, ఎండొస్తే మాడు. ఆ కష్టం ఇవాళ్టితో తీరిపోయింది. సరిగ్గా ఉదయం 9 గంటలకు బస్సు హారన్ వినిపించగానే ఊరంతా ఊరి బయటికి పరుగులు తీసింది. ముసలివాళ్లు కర్ర సాయంతో, చిన్న పిల్లలు చెప్పులు లేకుండానే వచ్చేశారు. బస్సును చూడగానే మహిళలు గుమ్మడి పండుతో దిష్టి తీసి, హారతిచ్చారు. యువకులు డప్పు చప్పుళ్లతో, బాణాసంచా కాల్చుతూ ఊరేగించారు.

Brahmajivadi Bus | ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి..

bus2

బస్సు అద్దాలకు పసుపు కుంకుమ, పూలదండలు, మామిడి తోరణాలు కట్టి పెళ్లి పీటలెక్కిన వరుడిలా అలంకరించారు. ఈ కమనీయ దృశ్యాన్ని చూసి సర్పంచ్ అంజనీ రఘుపతి సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇన్నేళ్ల నా జీవితంలో ఇదే తొలిసారి మా ఊరి మధ్యలో బస్సు నిలబడడం చూస్తున్నా. మా తాతలు కన్న కల ఇవాళ నెరవేరింది’ అని గద్గద స్వరంతో ఆమె చెప్పారు. ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ.. ఇకపై ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు రెండు ట్రిప్పులు ఉంటాయని ప్రకటించగానే జనం చప్పట్లతో హోరెత్తించారు. ఇక విద్యార్థుల ముఖాల్లో వెలుగు చూస్తే ఆ సంబరమే వేరు. “ఇన్నాళ్లు బడికి లేటవుతుందని పరిగెత్తేవాళ్లం. ఇప్పుడు హాయిగా బస్సులో కూర్చుని వెళ్తాం” అని విద్యార్థులు సంబరపడ్డారు. సంతకు సరుకు తీసుకెళ్లడానికి ఇక నెత్తి మీద మోసే బాధ తప్పిందని గ్రామస్తులు సంబరపడ్డారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *