Government School Admissions | ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ బడి.. రికార్డు స్థాయిలో అడ్మిషన్లు..

ఈ రోజుల్లో పిల్లవాడికి ఎల్​కేజీ సీటు కావాలన్నా రూ.వేలల్లో కుమ్మరించాల్సిందే.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government School Admissions | ఈ రోజుల్లో పిల్లవాడికి ఎల్​కేజీ సీటు కావాలన్నా రూ.వేలల్లో కుమ్మరించాల్సిందే. పుస్తకాలు, యూనిఫామ్స్, వ్యాన్ ఫీజులంటూ ప్రైవేట్ పాఠశాలలు సాగించే దోపిడీ అంతా ఇంతా కాదు. కానీ.. తాడ్వాయి మండలం (Tadwai Mandal) కన్కల్ గ్రామం ఈ ట్రెండ్‌కు స్వస్థి పలికింది.

Government School Admissions | సర్కారు స్కూల్​లోనే చదువుకోవాలని..

ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని గ్రామస్తులంతా తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో సైతం వసతులు కల్పించేందుకు గ్రామస్తులు ఏకమయ్యారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడిని ఏర్పాటు చేశారు. దీంతో ప్రైవేట్​కు వెళ్లే విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు.

Government School Admissions | రూపాయి ఫీజు లేకుండా కార్పొరేట్ చదువు..

రూపాయి ఫీజు లేకుండా కార్పొరేట్ స్థాయి చదువు మా ఊరి బడిలోనే అందిస్తాం.. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు’ అంటూ గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. ఆ గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా అడుగులు వేసి తీసుకున్న ఒక్కేఒక్క దృఢ సంకల్పం.. ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలను నవశకంలోకి నడిపించింది.

Government School Admissions | రాజీ లేకుండా వసతుల కల్పన..

కేవలం మాటలతో సరిపెట్టకుండా, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలలో వసతులను మెరుగుపర్చారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేదే లేదని సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన విద్యా ప్రమాణాలను కల్పించడంతో తల్లిదండ్రుల్లో నమ్మకం రెట్టింపైంది. ఫలితంగా.. ‘ప్రైవేట్ బళ్ల తళుకుబెళుకులు చూసి మోసపోవద్దు’ అనే పెద్దల మాటను ఊరంతా తప్పక పాటించింది.

Government School Admissions | 108 నుండి 253 కి పెరిగిన విద్యార్థులు..

Government School Admissions

ఈ విప్లవాత్మక మార్పుకు నిదర్శనంగా ఈ విద్యాసంవత్సరం కన్కల్​ బడి సరికొత్త రికార్డును నమోదు చేసింది. గతంలో ఈ పాఠశాలలో కేవలం 108 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా, గ్రామస్తుల సమష్టి కృషితో ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 253కు చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే ప్రీ-ప్రైమరీ (ఎల్​కేజీ, యూకేజీ) నుంచి మొదలుకొని పదో తరగతి వరకు ఏకంగా 145 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు గుడ్​బై చెప్పి, కన్కల్ ప్రభుత్వ పాఠశాల వైపు అడుగులు వేశారు. చిన్న పిల్లల తరగతుల నుండి హైస్కూల్ వరకు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ బడిలో చేరడం మండలంలోనే అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

Government School Admissions | 15 మందితో పర్యవేక్షణ కమిటీ..

పాఠశాల అభివృద్ధి కేవలం అడిషన్లతోనే ఆగిపోకుండా, నిరంతరం నాణ్యమైన విద్య అందేలా చూసేందుకు గ్రామస్తులు సరికొత్త అడుగు వేశారు. బడి నిర్వహణను, ఉపాధ్యాయుల బోధనను, విద్యార్థుల ప్రగతిని నిత్యం పర్యవేక్షించేందుకు 15 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కమిటీ ప్రతిరోజూ పాఠశాల తీరుతెన్నులను పర్యవేక్షిస్తూ, అవసరమైన వసతులను సమకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Government School Admissions | గ్రామమే ఒక కుటుంబంగా మారి సాధించిన విజయం..

ఏదేమైనా ప్రైవేట్ పాఠశాలల రంగుల బోర్డులు చూసి పరుగెత్తే ఈ రోజుల్లో.. కన్కల్ గ్రామం సాధించిన విజయం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. ఊరంతా అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన కన్కల్ గ్రామం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ విషయమై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బడులకు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని కొనియాడుతున్నారు. ఇలా గ్రామస్తులు అందరూ ఏకమై విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపిస్తే నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొంటున్నారు.

Government School Admissions | సౌకర్యాలు కల్పించడంలో నో కాంప్రమైజ్…

– మైలారం రవీందర్ రెడ్డి, కన్కల్ గ్రామ సర్పంచ్

ఫీజుల భారంతో నలిగిపోతున్న తల్లిదండ్రులకు మెరుగైన ప్రత్యామ్నాయం చూపించడమే మా లక్ష్యం. ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా సౌకర్యాలు మెరుగుపరచడంలో మేము ఎక్కడా రాజీ పడబోం. మా గ్రామం మరిన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామస్తులంతా కలిసికట్టుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఈ రోజు విద్యార్థుల సంఖ్య 253కు చేరింది. మా నమ్మకాన్ని నిలబెట్టిన ఉపాధ్యాయులకు, నమ్మిన గ్రామస్తులకు ధన్యవాదాలు. కన్కల్ బడిని రాష్ట్రంలోనే ఒక మోడల్ బడిగా తీర్చిదిద్దుతాం.

ఇది కూడా చదవండి..: Car Tree Crash | చెట్టును కారు ఢీకొన్న ఘటనలో మరొకరు మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *