అక్షరటుడే వెబ్‌డెస్క్: UK Forced Adoptions | బ్రిటన్ ( UK ) చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన ‘బలవంతపు దత్తతల’ (Forced Adoptions) ఉదంతంపై ఆ దేశ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ తాజాగా బహిరంగ క్షమాపణలు కోరారు. 1949 నుంచి 1976 వరకు జరిగిన ఈ అమానవీయ ఘటనలు అప్పట్లో లక్షలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి.
UK Forced Adoptions | ఏమిటీ ‘బలవంతపు దత్తతల’ దురాగతం?
సుమారు 30 సంవత్సరాల పాటు సాగిన ఈ ప్రక్రియలో, అవివాహిత మహిళలకు జన్మించిన పసిపిల్లలను వారి అనుమతి లేకుండానే ప్రభుత్వం దత్తతకు ఇచ్చింది. దాదాపు 1.85 లక్షల మంది చిన్నారులు తమ కన్నతల్లి ప్రేమకు దూరమై, అనాథలుగా వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ఆ కాలంలో అవివాహిత తల్లుల పట్ల సమాజంలో ఉన్న వివక్ష, మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగం, చర్చిలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాయి.
UK Forced Adoptions | ‘మదర్ అండ్ బేబీ హోమ్స్’ పేరుతో హింస..
ఈ వ్యవస్థలో అత్యంత క్రూరమైన భాగం ‘మదర్ అండ్ బేబీ హోమ్స్’. గర్భవతులైన అవివాహిత మహిళలను సమాజానికి దూరంగా ఉంచాలనే నెపంతో ఈ హోమ్స్‌కు పంపేవారు. అక్కడ వారికి సరైన వైద్యం, మానసిక మద్దతు అందకపోగా, తీవ్రమైన వేధింపులకు గురిచేసేవారు. ప్రసవం కాగానే, కనీసం బిడ్డ ముఖం కూడా చూపించకుండా తల్లుల నుంచి వేరు చేసేవారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి తెచ్చి, బలవంతంగా దత్తత పత్రాలపై సంతకాలు తీసుకునేవారు. దీనివల్ల లక్షలాది మంది పిల్లలు తమ మూలాలను, తల్లిదండ్రుల వివరాలను తెలియక తమ గుర్తింపును పూర్తిగా కోల్పోయారు.
UK Forced Adoptions | కేవలం క్షమాపణలతో సరిపెట్టవద్దు..
గతంలో స్కాట్లాండ్, వేల్స్ ప్రభుత్వాలు క్షమాపణలు చెప్పగా, ఇప్పుడు యూకే ప్రభుత్వం తరఫున ప్రధాని అధికారికంగా క్షమాపణలు కోరడం బాధితుల దశాబ్దాల పోరాటానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. అయితే, కేవలం మాటలతో సరిపెట్టకుండా బాధితులకు ఆచరణాత్మక న్యాయం జరగాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
UK Forced Adoptions | ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలు..
దత్తతకు వెళ్లిన వారు తమ అసలు తల్లిదండ్రులను కనుగొనేందుకు, ఆ కాలం నాటి హాస్పిటల్, చర్చి రికార్డులను సులభంగా చూసుకునే హక్కు కల్పించాలి. దశాబ్దాల బాధతో ఉన్న బాధితులకు ఉచిత ప్రభుత్వ కౌన్సిలింగ్ సేవలు అందించాలి. ప్రభుత్వ వ్యవస్థల మద్దతుతో జరిగిన ఈ నేరానికి బాధితులకు తగిన ఆర్థిక సాయం అందజేయాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలే మానవ హక్కులను ఉల్లంఘించిన ఈ ఘటన, బ్రిటన్ చరిత్రలో ఒక మరపురాని గాయంగా మిగిలిపోయింది. ప్రభుత్వం తీసుకునే రాబోయే నిర్ణయాలు బాధితుల జీవితాల్లో ఎంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Petrol Diesel Prices | పెట్రో ధరల తగ్గింపు ఇప్పుడే సాధ్యం కాదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ