అక్షరటుడే వెబ్‌డెస్క్: Petrol Diesel Prices | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ( Hardeep Singh Puri ) కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం చమురు ధరలను తగ్గించే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు. జూన్ 30 వరకు పెట్రోల్, డీజిల్ , ఎల్‌పీజీ విక్రయాల ద్వారా ఈ కంపెనీలకు సుమారు రూ. 74,781 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు.
Petrol Diesel Prices | ధరలు తగ్గకపోవడానికి కారణం..
అంతర్జాతీయంగా ముడిచమురు (Crude Oil) ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా ధరలు ఎందుకు తగ్గడం లేదనే ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆయిల్ కంపెనీలు ముడిచమురును రెండు నెలల ముందే కొనుగోలు చేస్తాయి. అంటే, ప్రస్తుతం ప్రాసెసింగ్ జరుగుతున్న ముడిచమురును ఏప్రిల్ లేదా మే నెలల్లో (అప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు) కొనుగోలు చేశారు. ఆ కారణంగానే, ఇప్పుడు ధరల తగ్గింపు ప్రభావం వెంటనే కనిపించదని ఆయన వివరించారు.
Petrol Diesel Prices | ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
పెట్రోల్, డీజిల్ ధరలను ఎప్పుడు తగ్గిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. “అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రాబోయే కొన్ని వారాల పాటు స్థిరంగా తక్కువగా ఉంటే, అప్పుడు ధరల తగ్గింపు గురించి చర్చించడం సమంజసంగా ఉంటుంది” అని మంత్రి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Overseas Job Fair | విదేశీ ఉద్యోగ మేళాకు విశేష స్పందన.. వేలాదిగా తరలివచ్చిన యువత