అక్షరటుడే వెబ్‌డెస్క్: Yogini Ekadashi | తెలుగు పంచాంగం ( Panchangam )ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘యోగిని ఏకాదశి’గా పిలుస్తారు. పద్మ పురాణం ప్రకారం, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం జులై 10, శుక్రవారం ఉదయం 8:10 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై, జులై 11, శనివారం ఉదయం 5:23 గంటలకు ముగుస్తుంది. అయితే, 11వ తేదీన సూర్యోదయానికి ముందే ఏకాదశి ముగిసి ద్వాదశి ప్రారంభమవుతోంది. శాస్త్రం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉండాలి కాబట్టి, జులై 10నే ఉపవాస దీక్షను ఆచరించాలని ప్రముఖ పండితులు స్పష్టం చేశారు.
Yogini Ekadashi | పూజా విధానం..
యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం కాబట్టి, ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. విష్ణుమూర్తికి పసుపు రంగు పూలమాలలను, నైవేద్యంగా పండ్లు, స్వీట్లు సమర్పించాలి. పూజా సమయంలో ఏకాదశి వ్రత కథను తప్పనిసరిగా వినాలి. అనంతరం మరుసటి రోజు ఉదయం ఉపవాస దీక్షను విరమించాలి. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, సిరిసంపదలు పెంపొందుతాయని భక్తుల విశ్వాసం.
Yogini Ekadashi | దాన విశిష్టత..
ఈ ఏకాదశి రోజున ధ్రుతి, శూలం, గండ యోగాలు ఏర్పడుతున్నాయి. జులై 10న ఉదయం 7:14 గంటలకు శుభ యోగాలు ప్రారంభమవుతాయి. ఈ పవిత్ర రోజున దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా, శక్తి మేరకు పేదలకు అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అలాగే, వస్త్రదానం చేయడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోతాయి. తెలివితేటలను, మేధస్సును పెంచుకోవడానికి నెయ్యిని, గ్రహ దోషాల నివారణకు, సుఖసంతోషాల కోసం నువ్వులను దానం చేయాలి. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఫలితాల కోసం పండ్లను, మోక్ష ప్రాప్తి కోసం గోమాతను దానం చేయడం ఎంతో విశిష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Modi Melbourne | సహాయం చేసేటప్పుడు పాస్‌పోర్ట్ రంగు చూడము.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు