అక్షరటుడే వెబ్‌డెస్క్: Himachal Heavy Rains | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) కిన్నౌర్ జిల్లా లిప్పా ఖాస్‌లో ఎడతెరిపి లేని వర్షాలకు కొండచరియలు విరిగిపడి మట్టి, రాళ్లతో కూడిన బురద ప్రవాహం లిప్పా ఖాస్ వంతెనను తాకుతుండటంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వంతెనకు ప్రమాదం ఉందని, నదులు, వాగుల వద్దకు వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, రహదారులు మూసుకుపోయే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో శుక్రవారం సిర్మౌర్, సోలన్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను అధికారులు మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లను అధికారులు మూసివేశారు.
Himachal Heavy Rains | దంచికొడుతున్న వాన

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. సిర్మౌర్‌లోని పచ్చాడ్లో అత్యధికంగా 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షాలకు పలు కొండచరియలు విరిగిపడటం, వరదలు, రహదారులు మూసుకుపోవడం వంటివి సంభవించాయి. అధికారులు 75 రహదారులను మూసివేశారు. అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, నీటి సరఫరా పథకాలు కూడా ప్రభావితమయ్యాయి.
Himachal Heavy Rains | కూలిన గోడ
సిమ్లా నగరంలోని వికాస్‌నగర్ ప్రాంతంలో ఒక గోడ కూలి, పార్క్ చేసి ఉన్న రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. బ్రాండ్లీ గ్రామంలో ఒక ఇంటి ప్రహరీ గోడ దెబ్బతినగా, సున్నీలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) క్యాంపస్‌లోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇది కూడా చదవండి..: Wayanad Landslide | వయనాడ్‌లో ఏడుకు చేరిన మృతుల సంఖ్య