Daivalaguda six murders | మానవ మృగం నరమేధం.. మొదట బాలికపై అఘాయిత్యం, హత్య.. షాబాద్​ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అమ్మమ్మ, నాయనమ్మల ఒడిలో సురక్షితంగా ఉండాల్సిన బాలిక.. కన్నతండ్రి చేతిలోనే ప్రాణాలు విడిచిన చిన్నారులు.. ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Daivalaguda six murders | చట్టాలు ఎవరి కోసం? నేరస్థుల్లో భయం పెంచడానికా.. లేక బాధితులను మరింత అభద్రతాభావంలోకి నెట్టడానికా? రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన నరమేధం చూశాక.. సమాజంలో మానవత్వం ఉందా?

అసలు మన చట్టాలంటే నేరగాళ్లకు భయం లేదా? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తున్నాయి. ఒక ‘పొక్సో (POCSO)’ కేసు నిందితుడు పగతో రగిలిపోయి, ఏకంగా ఆరుగురిని నరికి చంపిన తీరు.. మన రక్షణ వ్యవస్థల వైఫల్యాన్ని నగ్నంగా చూపిస్తోంది.

Daivalaguda six murders | ఆ రెండు గంటల రాత్రి.. మృత్యుపాశం!

రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు.. ఆ రెండు గంటల కాలం దైవాలగూడ గ్రామంలో రక్తాశ్రువులు పారించింది. రాజ్‌కుమార్ అనే మానవ మృగం కక్షతో రగిలిపోతూ చేసిన మారణహోమంలో ఆరు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

తనపై పొక్సో కేసు పెట్టిందన్న కక్షతో.. అభం శుభం తెలియని ఒక బాలికను రాజ్‌కుమార్ బలవంతంగా కారులో ఎక్కించుకున్నాడు. కళ్లెదుటే మనవరాలిని తీసుకెళ్తుంటే ఆపడానికి ప్రయత్నించిన ఆ వృద్ధులను తోసేసి.. 3 కిలోమీటర్ల దూరంలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి, గొంతు కోసి కిరాతకంగా చంపేశాడు.

Daivalaguda six murders | వృద్ధులపై కనికరం లేని కసాయి

అంతటితో ఆ రాక్షసుడి కసి తీరలేదు. తిరిగి గ్రామానికి వచ్చి.. బాలికను కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఆమె అమ్మమ్మ, నాయనమ్మలను అతి కిరాతకంగా నరికి చంపాడు. వయసుపైబడిన వారనే జాలి కూడా ఆ మృగానికి కలగలేదు.

Rangareddy Murders | ఘోరం.. కక్షతో ఆరుగురి దారుణ హత్య.. బాధితులు పొక్సో కేసు కుటుంబం!

Daivalaguda six murders | కన్నపిల్లలు, భార్య అని కూడా చూడకుండా..

ఈ రక్తపాతం ముగిశాక, తన ఇంటికి వెళ్లి ‘పిల్లలను చూస్తా’నని భార్యకు ఫోన్ చేశాడు. నమ్మి తలుపు తీసిన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణభయంతో ఆమె బయటకు పరుగులు తీసినా.. వదలకుండా ఇంట్లోకి లాక్కెళ్లి ప్రాణాలు తీశాడు.

ఆపై.. కన్న ప్రేమనైనా తలుచుకోకుండా, తన రక్త పంచుకు పుట్టిన ఇద్దరు కన్నబిల్లల గొంతు కోసి నిర్దయాత్మకంగా చంపేశాడు. చివరకు తన తండ్రికి ఫోన్ చేసి “అందరినీ చంపేశా” అని చెప్పి నిస్సిగ్గుగా పరారయ్యాడు.

Daivalaguda six murders | వ్యవస్థల వైఫల్యం కాదా?

ఈ ఘోర కలిని కేవలం ఒక నేరంగా చూసి సరిపెట్టుకోగలమా? పొక్సో వంటి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ.. ఒక నేరస్థుడిలో ఇంతటి తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది?

పొక్సో కేసు నమోదైన తర్వాత బాధితులకు, వారి కుటుంబాలకు తగిన రక్షణ కల్పించడంలో వ్యవస్థలు ఎందుకు విఫలమవుతున్నాయి? నిందితుడు ఇంత బహిరంగంగా తిరుగుతూ, బాధితుల ఇళ్లపై పడి దాడి చేస్తుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్టు?

నిందితుడిలో చట్టం పట్ల భయం లేకపోవడమే ఈ ఘోరానికి ప్రధాన కారణం. “కేసు పెట్టారు కదా.. నన్నేం చేస్తారు? మీ అంతం చూస్తా” అనే అహంకారం, క్రూరత్వం వల్లే ఈరోజు ఆరు ప్రాణాలు బలిపీఠమెక్కాయి. తప్పు చేసిన వాడు జైలు ఊచలు లెక్కపెట్టాల్సింది పోయి, స్వేచ్ఛగా తిరుగుతూ ఒకే కుటుంబానికి చెందిన వారిని, కన్నవారిని పొట్టనబెట్టుకోవడం చట్టాల అమలు తీరుకు పట్టిన అద్దం.

Daivalaguda six murders | విషాదంలో గ్రామం..

ఈ దారుణ ఘటనతో దైవాలగూడ గ్రామం భయంతో వణికిపోతోంది. ఊరంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేశ్ గౌతమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు.

కానీ, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అమ్మమ్మ, నాయనమ్మల ఒడిలో సురక్షితంగా ఉండాల్సిన బాలిక.. కన్నతండ్రి చేతిలోనే ప్రాణాలు విడిచిన చిన్నారులు.. ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?

మానవ మృగాల మనస్తత్వం మారనంత కాలం.. చట్టాల అమలులో వేగం, పారదర్శకత లేనంత కాలం ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. నిందితుడు రాజ్‌కుమార్‌ను తక్షణమే పట్టుకుని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష అమలు చేయాలి.

అప్పుడే చట్టాలపై ప్రజలకు నమ్మకం, నేరగాళ్లకు భయం కలుగుతాయి. ఇకనైనా వ్యవస్థలు మేల్కొనకపోతే.. ఇలాంటి క్రూరత్వానికి మరికొన్ని కుటుంబాలు బలవ్వక తప్పదు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *