అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: AITUC District Conference | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కనీస వేతనాల బోర్డు మెంబర్ ఎండీ యూసుఫ్ అన్నారు. ఆదివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో (Nizamabad) నిర్వహించిన ఏఐటీయూసీ(AITUC) 22వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు.
AITUC District Conference | బానిసలుగా మారుస్తున్నారు
అంతకుముందు దివంగత కార్మిక నేతల చిత్రపటాలకు యూసుఫ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎండీ యూసుఫ్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ మాట్లాడుతూ… బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్‌లను తెచ్చిందన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థించడం బాధాకరమన్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా పాలకులు పట్టించుకోవడం లేదని, పైగా 8 గంటల పనిదినాన్ని 10 నుంచి 12 గంటలకు పెంచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం వల్ల పేదరికం పెరుగుతోందని, లేబర్ కోడ్‌ల రద్దు, అసంఘటిత కార్మికుల హక్కుల రక్షణే ఈ మహాసభల ముఖ్య అజెండా అని పేర్కొన్నారు.
AITUC District Conference | చమురు సంపద దోపిడీకి..
అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య జిల్లా నివేదికను సభలో ప్రవేశపెట్టారు. అమెరికా సామ్రాజ్యవాద పోకడల వల్ల వెనిజులా, ఇరాన్ వంటి దేశాల ఖనిజ, చమురు సంపద దోపిడీకి గురవుతోందని, యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మికుల వేతనాలు పెంచకుండా, నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతోందని విమర్శించారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా 28 సార్లు దేశవ్యాప్త సమ్మెలు జరిగినా ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ముకాస్తోందని, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు.
AITUC District Conference | పనిగంటల పెంపును అడ్డుకుంటున్నాం..
జీవో.. 58 ద్వారా పని గంటల పెంపును ఏఐటీయూసీ అడ్డుకుందని, రెండేళ్లు దాటినా పీఆర్సీ ప్రకటించకపోవడం దుర్మార్గమని ఓమయ్య అన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ బలోపేతానికి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే పోరాటాలపై తీర్మానాలు చేశారు. అంగన్‌వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ కార్మిక సంఘాలను బలోపేతం చేయడం తమ లక్ష్యమన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌ల రద్దుకై ఉధృత పోరాటాలు నిర్వహించడంతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించి, కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించేలా ఒత్తిడి తేవడం ఏఐటీయూసీ ముఖ్య కర్తవ్యం అన్నారు. జిల్లాలోని స్థానిక కార్మికులకే మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పోరాడతామన్నారు. ఈ మహాసభలలో సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఏకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమయ్య, జిలా నాయకులు రాజన్న, చక్రపాణి, హన్మాండ్లు, భాను, కవిత, భాగ్యమ్మ అనిల్, రమేష్, దేవేందర్, వివిధ కార్మిక సంఘాల నేతలు, జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వందలాది మంది కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు.
ఇది కూడా చదవండి: వియత్నాం బోటు ప్రమాద బాధితుల మృతదేహాల తరలింపు