అక్షరటుడే, వెబ్‌డెస్క్: ABVP College Bandh | తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తూ జులై 14న (మంగళవారం) రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ఒక ప్రకటనలో కోరారు.
ABVP College Bandh | రూ. 11,000 కోట్ల బకాయిలు.. విద్యార్థుల డ్రాపౌట్స్
ఈ సందర్భంగా మాచర్ల రాంబాబు సమస్యను వివరిస్తూ.. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని తెలిపారు. అయితే, సర్కారు సరైన సమయంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల ప్రస్తుతం రూ.11,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని మండిపడ్డారు.
ABVP College Bandh | పెరుగుతున్న డ్రాపౌట్స్..
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏటా సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేసి డ్రాపౌట్ అవుతున్నారని వాపోయారు. 4.5 లక్షల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక కాలేజీల నుంచి తమ సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య కోసం ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు.
ABVP College Bandh | విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా విఫలం
గతంలో ఉన్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తుంగలో తొక్కితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోగా, విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోందని విమర్శించారు. తానే ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి బకాయిలు విడుదల చేయకపోవడం వల్లే ఈ వ్యవహారం చివరకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని గుర్తుచేశారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామన్న హామీ ఏమైందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ABVP College Bandh | విద్యార్థుల హక్కులపై ఉక్కుపాదం

ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని, బడ్జెట్ కాలేజీలు సైతం మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం లెక్చరర్లుగా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అనేవి విద్యార్థుల హక్కే తప్ప ప్రభుత్వం వేసే భిక్ష కాదని స్పష్టం చేశారు. హక్కుల కోసం నిరసన తెలిపితే విద్యార్థులపై లాఠీఛార్జీలు చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు.
ABVP College Bandh | బంద్‌ను విజయవంతం చేయండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట తప్పకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అంకురార్పణ చేస్తామని, అన్ని కళాశాల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలై కాంగ్రెస్ ప్రభుత్వానికి మరణశాసనం రాస్తాయని హెచ్చరించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తూ రాక్షసానందం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జులై 14న నిర్వహించబోయే రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని మాచర్ల రాంబాబు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి..: Road Accident | ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరి మృతి