El Nino Telangana | ఎల్​నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి తుమ్మల

ఎల్​నినోతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : El Nino Telangana | ఎల్​నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ (ICRISAT)లో భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు సూచించిన ప్రతి యాజమాన్య చర్యను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి, జిల్లాల్లో అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు, వ్యవసాయ అనుబంధరంగ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల వర్షపాతం పరిస్థితులను రోజువారీగా సమీక్షించాలని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 20 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉందన్నారు.

El Nino Telangana | సమన్వయంతో పని చేయాలి

ఎల్​నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రతివారం మండలాల వారిగా బులిటెన్​ విడుదల చేయాలన్నారు. ఈ బులెటిన్‌లో మండలాల వారీగా నమోదైన వర్షపాతం, రాబోయే వారానికి, నెలాఖరు వరకు ఉండే వాతావరణ పరిస్థితుల అంచనాలు, డ్రై స్పెల్స్ ఏర్పడే అవకాశాలు, గరిష్ఠ–కనిష్ఠ ఉష్ణోగ్రతలు, నేల తేమ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి వివరాలు పొందుపర్చాలని సూచించారు.

El Nino Telangana | వరి రైతులకు సూచలను

elnino

వరి రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం వరి పంట నారుమడి దశలో ఉన్న రైతులు నారు పీకడానికి వారం రోజుల ముందు ఎకరానికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3CG గ్రాన్యూల్స్ వేయాలని, నాటే సమయంలో నారు ఆకుల చివరలను కత్తిరించి నాటాలన్నారు. ఇంకా నారు వేయని రైతులు తక్కువ కాలంలో పండే రకాలతో డ్రై డైరెక్ట్ సీడెడ్ రైస్ (DDSR) విధానాన్ని అనుసరించాలని సూచించారు. కాలువల ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి వరికి బదులుగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, అలసందలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తెలిపారు.

దీనిని కూడా చదవండి : Godavari Water | కాంగ్రెస్​ నాయకులను ప్రజలు ఉరికించి కొడతారు : కేటీఆర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.