అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Registration Services | తెలంగాణ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలను జూన్ 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శాఖ అధికారులు ప్రకటించారు. సర్వర్ అప్‌గ్రేడేషన్, నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Telangana Registration Services | ఆన్‌లైన్ సేవలతో పాటు..
శాఖ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన సాంకేతిక మెరుగుదల పనులు చేపడుతున్నందున ఈ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని సేవలు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ సేవలతో పాటు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించే సేవలు కూడా ఈ వ్యవధిలో నిలిచిపోనున్నాయి.

Telangana Registration Services | అతిపెద్ద సర్వర్ అప్‌గ్రేడేషన్
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద సర్వర్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమమని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సేవల భద్రత, వేగం, సామర్థ్యం మరింత మెరుగుపడతాయని చెప్పారు.
రిజిస్ట్రేషన్ సేవలు అవసరమైన ప్రజలు తమ పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా అత్యవసర రిజిస్ట్రేషన్ అవసరాలు ఉన్నవారు జూన్ 26కు ముందు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Telangana Registration Services | జూన్ 29 నుంచి యథావిధిగా..
అప్‌గ్రేడేషన్ పనులు పూర్తయిన అనంతరం జూన్ 29 నుంచి అన్ని రిజిస్ట్రేషన్ సేవలను యథావిధిగా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులతో భవిష్యత్తులో వినియోగదారులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన సేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.