అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yuva Sangrama Sadasu | యూత్ డిక్లరేషన్ పేరిట యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు డెత్ డిక్లరేషన్ రాయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరొక లెక్క అన్నారు. ఉరకలెత్తే యువతరం సభకు వచ్చిందన్నారు. యువత కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెనలు అవుతాయన్నారు. కాంగ్రెస్ చేసిన మహా ద్రోహాన్ని గుర్తు చేసుకోవడానికే ఈ సమావేశం పెట్టినట్లు తెలిపారు. 38 నెలల కిందట ఇదే సరూర్‌నగర్‌లో దారుణమైన దగా జరిగిందన్నారు. కాంగ్రెస్ హామీలతో యువత దగా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేటుగాళ్లు నకిలీ ప్రేమ నటించి యూత్ డిక్లరేషన్ ఇచ్చారన్నారు.
Yuva Sangrama Sadasu | 24 హామీలు..
ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ ఇచ్చారన్నారు. ఇందులో 24 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అందులో ఒకటి కూడా నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిత్తుల మారి ముసలి నక్క యువతరాన్ని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌కు అధికార పీఠం వచ్చి 31 నెలలు అవుతున్నా.. హామీలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు ఓటేయవద్దని ఇంటింటికి తిరిగిన యువత ఇప్పుడు బాధపడుతోందన్నారు. కాంగ్రెస్‌కు డెత్ డిక్లరేషన్ రాస్తేనే సోయి వస్తుందన్నారు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల వరకు పుట్టగతులు లేకుండా పోతారని అన్ని పార్టీలకు తెలియాలన్నారు.
Yuva Sangrama Sadasu | రాహుల్‌గాంధీపై విమర్శలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారని గుర్తు చేశారు. ఆయనకు తెలుగు రాదని, తెలివి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి భాష రాదని, తెలంగాణ బాధలు తెలియవన్నారు. ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులపై లాఠీఛార్జీ చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అశోక్ నగర్లో వచ్చి చెప్పినా రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Yuva Sangrama Sadasu | లూటీఫికేషన్ నడుస్తోంది

జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందో రాహుల్ గాంధీ చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో నోటిఫికేషన్ కాదు, లూటీఫికేషన్ నడుస్తోందని ఆరోపించారు. జాబు క్యాలెండర్ వదిలేసి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు.
Yuva Sangrama Sadasu | కొన్ని పొరపాట్లు జరిగాయి
తమ హయాంలో కొన్ని పొరపాట్లు జరిగాయని కేటీఆర్ అంగీకరించారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ అయిందన్నారు. అయితే తమ ప్రభుత్వమే నిందితులను పట్టుకుందన్నారు. పొరపాట్లను సరి చేసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 2.32 లక్షల నియామకాలు చేపట్టామన్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలు 1.83 లక్షలు అని పేర్కొన్నారు. తాము ఉద్యోగాల ఇచ్చినట్లు ప్రచారం చేసుకోలేదన్నారు. దీంతోనే కాంగ్రెస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేశారన్నారు. రాజీవ్ యువ వికాసం పేరిట సబ్సిడీ లోన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అది ఎక్కడైనా అమలు అవుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను గుజరాత్‌కు తీసుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Vikram 1 Launch | నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్–1 రాకెట్