అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ram Janmabhoomi Trust | అయోధ్య Ayodhya రామమందిర నిర్వహణకు సంబంధించిన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కోరుతూ నిర్మోహీ అఖాడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఉన్న ట్రస్ట్‌ను ప్రజా ధార్మిక ట్రస్ట్‌గా పునర్నిర్మించాలని, ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ Adit నిర్వహించాలని తన పిటిషన్‌లో కోరింది.
Ram Janmabhoomi Trust | జవాబుదారీతనం అవసరమంటూ..
2019లో అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలులో అనేక అంశాలు పూర్తి స్థాయిలో పాటించలేదని నిర్మోహీ అఖాడా వాదించింది. ప్రస్తుతం ట్రస్ట్ నిర్వహణ విధానం ప్రజా ధార్మిక సంస్థ కంటే ప్రైవేట్ సంస్థ తరహాలో మారిందని, పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని పిటిషన్‌లో పేర్కొంది.
ఇటీవల రామమందిరానికి భక్తులు సమర్పించిన నగదు, విలువైన కానుకల నిర్వహణపై వివాదాలు వెలుగులోకి రావడం, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేయడం వంటి పరిణామాలను కూడా నిర్మోహీ అఖాడా తన వాదనలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ట్రస్ట్ ఆర్థిక, ఆస్తుల లావాదేవీలపై సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరింది.
Ram Janmabhoomi Trust | 1950, 1982 నాటి విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించాలంటూ..
అంతేకాకుండా, ప్రస్తుతం గర్భగుడిలో ప్రతిష్ఠించిన కొత్త విగ్రహం స్థానంలో 1950, 1982 కాలానికి సంబంధించిన అసలు విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించాలని కూడా పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. కొత్త విగ్రహ ప్రతిష్ఠతో అసలు వివాదానికి సంబంధించిన అంశాల స్వరూపం మారిందని నిర్మోహీ అఖాడా అభిప్రాయపడింది.
ట్రస్ట్‌లో తమకు కేటాయించిన స్థానాన్ని సంప్రదాయ పద్ధతులకు విరుద్ధంగా భర్తీ చేశారని, తమ ప్రతినిధిత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా అఖాడా ఆరోపించింది. భవిష్యత్తులో ట్రస్టీల నియామకానికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని, నిర్మోహీ అఖాడాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది.
Ram Janmabhoomi Trust | సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయా..
అయితే, 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పును తిరిగి సవాలు చేయడం తమ ఉద్దేశం కాదని నిర్మోహీ అఖాడా స్పష్టం చేసింది. ఆ తీర్పులోని ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయా లేదా అన్న అంశాన్ని మాత్రమే కోర్టు పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ కేసులో కోర్టు తీసుకునే నిర్ణయం రామమందిర ట్రస్ట్ నిర్వహణ, పాలనా విధానాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.