అక్షరటుడే వెబ్‌డెస్క్: Madhira JNTU College | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మధిర నియోజకవర్గ కేంద్రంలో జేఎన్టీయూ (JNTU) ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) ప్రత్యేక కృషితో, ఈ ప్రాంత విద్యార్థుల ఉన్నత విద్యా కలను నిజం చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (GO) జారీ చేసింది.
Madhira JNTU College | ఇచ్చిన మాట ప్రకారం..
ఈ నెల (జులై) 10న చింతకాని మండలం మోత్కుపల్లి క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆ సభలో మధిరలో ఇంజనీరింగ్ కళాశాల ఆవశ్యకతను వివరిస్తూ, వెంటనే మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం విన్నవించారు. ఆయన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కళాశాలను మంజూరు చేస్తున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం, ఈ నెల 18నే ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయడంతో నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Madhira JNTU College | విద్యార్థుల కష్టాలకు ముగింపు..
ప్రస్తుతం మధిర ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడంతో, విద్యార్థులు సాంకేతిక విద్య కోసం హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. లక్షలాది రూపాయల ఫీజులు, వసతి ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి , బడుగు బలహీన వర్గాల కుటుంబాల విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యతోనే చదువును ఆపేసి తమ ఉన్నత లక్ష్యాలకు దూరమవుతున్నారు. ఇప్పుడు సొంత ప్రాంతంలోనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అందుబాటులోకి రావడంతో, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డాయి.
Madhira JNTU College | ఎడ్యుకేషన్ హబ్‌గా మధిర..
మధిరలో ఇప్పటికే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు డిప్లొమా వ్యవసాయ, పాలిటెక్నికల్, ఐటీఐ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. విశాలమైన ప్రాంగణంలో, సొంత భవనాలు , హాస్టల్ వసతులతో ఉన్న ఈ విద్యాసంస్థల్లో సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఇప్పుడు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల కూడా తోడవ్వడంతో, మధిర ఒక బలమైన ‘ఎడ్యుకేషన్ హబ్’గా రూపాంతరం చెందనుంది.
Madhira JNTU College | మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు..
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు , మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం చొరవతో మధిరలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ , ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటి ద్వారా స్థానిక యువతకు మెరుగైన సాంకేతిక నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
మధిర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో, విద్యార్థుల , యువత ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై నియోజకవర్గ మేధావులు, విద్యావంతులు, తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి, కళాశాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: OBC National Conference | 7న బెంగళూరులో ఓబీసీ జాతీయ మహాసభ