అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Governor | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ (Andhra Pradesh Governor) సయ్యద్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురవడంతో శనివారం తెల్లవారుజామున అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.
సమాచారం ప్రకారం, గవర్నర్ నజీర్ శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉండగా, విమానం ఆలస్యమైంది. రాత్రి 12 గంటలకు చేరుకోవాల్సిన విమానం ఆలస్యంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో విజయవాడకు చేరుకుంది. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో ఆయనకు కడుపునొప్పి ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
AP Governor | కిడ్నీలో రాళ్లు..
మణిపాల్ ఆస్పత్రి (Manipal Hospital)లో వైద్యులు గవర్నర్‌కు పలు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అవసరమైతే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించినప్పటికీ, ప్రస్తుతం ముఖ్యమైన పనులు ఉన్న నేపథ్యంలో గవర్నర్ మరోసారి ఆస్పత్రికి వస్తానని చెప్పి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో, గతంలో కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన సందర్భాలు ఉన్నాయి.
2023లో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడగా, పరీక్షల అనంతరం అపెండిసైటిస్ సమస్య గుర్తించి శస్త్రచికిత్స నిర్వహించారు. 2024లో కూడా అస్వస్థతకు గురవడంతో ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురికావడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగించినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటం ఉపశమనాన్ని కలిగిస్తోంది. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Vijayasai Reddy | జూలైలో రాజకీయాల్లోకి తిరిగి వస్తానంటున్న విజయసాయిరెడ్డి.. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన?

