Stock Market Crash | స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా.. 3 రోజుల్లో సెన్సెక్స్ 2,600 పాయింట్లు పతనం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | అమెరికా -ఇరాన్ ల మధ్య శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడం, హార్మూజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతుండడంతో ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి.

క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండడంతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తూనే ఉండడంతో రూపాయి విలువ రోజురోజుకు బలహీనపడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద అమ్మకాలకు పాల్పడుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

Stock Market Crash | రూ. 7 లక్షల కోట్లకుపైనే నష్టం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం నుంచి వరుసగా పతనమవుతున్నాయి. 3 రోజుల్లో సెన్సెక్స్ 2,609 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 679 పాయింట్లు పడిపోయింది. అంటే సెన్సెక్స్ 3.3 శాతం, నిఫ్టీ 50 ఇండెక్స్ 2.8 శాతం క్షీణించాయి. ఇన్వెస్టర్లు రూ. 7 లక్షల కోట్లకుపైనే నష్టపోయారు.

Stock Market Crash | పడేసిన ఐటీ..

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బెంచ్ మార్క్ సూచీలను ఐటీ రంగం పడేసింది. నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ ఈ వారంలోనే పది శాతానికిపైగా క్షీణించింది. హెచ్ సీఎల్ టెక్ 15.76 శాతం, ఇన్ఫోసిస్ 12.04 శాతం, టెక్ మహీంద్రా 9.70 శాతం, టీసీఎస్ 7.08 శాతం నష్టపోయాయి. దీని ప్రభావం ప్రధాన సూచీలపై కనిపించింది.

Stock Market Crash | రూపాయిలో బలహీనత..

ముడి చమురు ధరలు వారంలో సుమారు 18 శాతం పెరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరోసారి రూ. 94 దిగువకు పడిపోయింది. చివరి సెషన్‌లో 94.25 వద్ద ముగిసింది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచుతోంది.

Stock Market Crash

Stock Market Crash | కొనసాగిన పెట్టుబడుల ఉపసంహరణ

ఎఫ్ఐఐలు ఈ వారంలోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈనెల 20న నికరంగా రూ. 1,060 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన ఎఫ్ఐఐలు.. 21న రూ. 1,918 కోట్లు, 22న రూ. 2,078 కోట్లు, 23న రూ. 3,254 కోట్లు, 24న రూ. 8,828 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. అంటే ఫారిన్ ఇన్వెస్టర్లు ఈ వారంలో నికరంగా రూ. 17,138 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించారు. దీంతో మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి..: April 25 Gold Rates | పెళ్లిళ్ల సీజన్‌లో గుడ్ న్యూస్ .. ప‌డిపోతున్న బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *