Child Marriage | బాల్య వివాహాన్ని ఆపడానికి వెళ్లి.. పెళ్లి కూతురి చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Child Marriage | రాష్ట్రంలో నేటికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు తల్లిదండ్రులు పెళ్లి వయసు రాకముందే తమ కూతుళ్లకు వివాహం చేస్తున్నారు. అయితే వీటిపై ఫిర్యాదులు అందితే ఐసీడీఎస్​ అధికారులు (ICDS Officers) వెళ్లి పెళ్లి అడ్డుకుంటారు. ఓ చోట పెళ్లిని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు పెళ్లి కూతురికి బదులుగా.. ఆమె చెల్లిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Child Marriage | గద్వాలలో..

గద్వాల జిల్లా (Gadwal District) ధరూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో గద్వాలకు చెందిన బాలికకు పెద్దలు వివాహం నిశ్చయించారు. గురువారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. ఆమె మైనర్​ కావడంతో అధికారులకు సమాచారం అందింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వస్తున్నారనే సమాచారంతో కుటుంబ సభ్యులు పెళ్లి కూతురిని అక్కడి నుంచి తప్పించారు.

Child Marriage | విచారణ చేయకుండానే..

ఐసీడీఎస్ అధికారులు బుధవారం రాత్రి బాలిక ఇంటికి వచ్చారు. అప్పటికే ఆమెను కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతానికి తీసుకెళ్లారు. అయితే అధికారులు ఆమె చెల్లిని పెళ్లి కూతురుగా భావించారు. ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. కనీసం పెళ్లి కూతురు ఎవరు.. పెళ్లి పత్రికలో పేరు, ఆధార్​ కార్డులో వివరాలు ఏవి చూడకుండానే అధికారులు ఆమెను తీసుకెళ్లి సంరక్షణ కేంద్రానికి తరలించారు. గ్రామస్తులు సైతం ఆ విషయంలో మౌనంగా ఉండిపోయారు.

Child Marriage

Child Marriage | అర్ధరాత్రి వివాహం

అధికారులు పెళ్లి కూతురి చెల్లిని తీసుకెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ బాలిక వివాహం జరిపించారు. అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో గుడిలో గుట్టుగా పెళ్లి చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో సోషల్​ మీడియా (Social Media)లో వైరల్​గా మారింది. అధికారులు వెళ్లినా.. వివాహం జరగడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: TRS Panchajanyam | తెలంగాణ రాష్ట్ర సేన ‘పాంచజన్యం’.. ఐదు హామీలతో కవిత మార్క్ పాలిటిక్స్!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *