అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amarnath Yatra Resumes | భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి, యాత్రా మార్గం ప్రభావితం కావడంతో ఆరు రోజుల పాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర శనివారం తిరిగి ప్రారంభమైంది. బల్తాల్ వైపు వెళ్తున్న యాత్రా వాహనశ్రేణి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ ప్రాంతాన్ని దాటి అమర్‌నాథ్ వైపు వెళ్లింది.
ఇటీవల జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir)లో భారీ వర్షాలు కురవడం, కొండచరియలు విరిగిపడటంతో అధికారులు అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. తాజాగా వాతావరణం అనుకూలించడంతో యాత్రను ప్రారంభించారు. శనివారం 6 వేల మందికి పైగా యాత్రికులు భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి కశ్మీర్‌కు బయలుదేరారని అధికారులు తెలిపారు. 1,470 మంది మహిళలు, 25 మంది పిల్లలు మరియు 54 మంది సాధువులతో సహా మొత్తం 6,269 మంది యాత్రికులు ఉన్న 18వ బృందం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తెల్లవారుజామున 2:40 గంటలకు 223 వాహనాల కాన్వాయ్‌లో బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరిందని అధికారులు తెలిపారు.
Amarnath Yatra Resumes | ఆగస్టు 28 వరకు..
అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది. ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. వీరిలో జమ్మూ బేస్ క్యాంప్ నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించిన సుమారు 1.20 లక్షల మంది భక్తులు కూడా ఉన్నారు. కాగా శనివారం యాత్రికుల రాకపోకలను అనుమతించే ముందు అధికారులు సమగ్ర భద్రతా చర్యలు చేపట్టారు. యాత్రా వాహనశ్రేణి సురక్షిత, సుఖవంతమైన ప్రయాణానికి వీలుగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి భద్రతను పటిష్టం చేశారు. కీలక ప్రదేశాలలో సిబ్బందిని మోహరించారు.
ఇది కూడా చదవండి..: Maharashtra TET Paper Leak | టెట్ పేపర్ లీకేజీ నిందితుడి అరెస్ట్