అక్షరటుడే వెబ్‌డెస్క్: Joseph Vijay Deepfake | తమిళనాడు ( Tamil Nadu )ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పోలికలతో రూపొందించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తామంటూ నకిలీ వాగ్దానాలు చేస్తూ, అమాయకులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు ఈ వీడియోను వాడుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ ఫేక్ వీడియోకు హిందీ ఆడియోను అటాచ్ చేసి, సహాయం కావాల్సిన వారు ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని ప్రచారం చేస్తున్నారు.
Joseph Vijay Deepfake | మెటాకు పోలీసుల లేఖ..
నిత్యం జరిగే సైబర్ పెట్రోలింగ్ సమయంలో ఈ నకిలీ విజువల్స్ వెలుగులోకి రావడంతో తమిళనాడు క్రైమ్ బ్రాంచ్-సీఐడీ (CB-CID) సైబర్ క్రైమ్ విభాగం సెప్టెంబర్ 1న కేసు నమోదు చేసింది. ఒక నకిలీ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఈ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఆ అకౌంట్ల వివరాలు, లాగ్స్ ఇవ్వాలని ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) సంస్థను కోరారు. అంతేకాకుండా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లన్నింటి నుంచీ ఈ ఫేక్ వీడియోలను తొలగించాలని ఆదేశించారు. ప్రాథమిక విచారణలో భాగంగా సీఎం విజయ్ పేరిట ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు ఫేస్‌బుక్ తదితర మాధ్యమాల్లో చాలానే చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Joseph Vijay Deepfake | పోలీసుల హెచ్చరిక..
ఈ నకిలీ వీడియోలను షేర్ చేస్తున్న ఖాతాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్ ఆధారిత ఫేస్‌బుక్ ఐడీల నుంచి ఆపరేట్ అవుతున్నట్లు విచారణలో బయటపడింది. దీంతో ఈ సైబర్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇవన్నీ పూర్తిగా AI టెక్నాలజీతో సృష్టించిన మోసపూరిత వీడియోలని, ప్రజలు ఎవరూ ఈ వలలో పడొద్దని తమిళనాడు పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి వీడియోల్లో కనిపించే వాట్సాప్ గ్రూప్‌లలో చేరడం గానీ, నంబర్లకు కాల్ చేయడం గానీ చేయవద్దని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, మిత్రులను కూడా ఈ ఆన్‌లైన్ స్కామ్‌ల పట్ల అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: TG Transco Warning | టీజీ ట్రాన్స్‌కో సీరియస్ వార్నింగ్.. అంతర్గత విషయాలు బయటకు చెబితే కఠిన చర్యలు