అక్షరటుడే, వెబ్‌డెస్క్: TG Transco Warning | తెలంగాణ (Telangana) ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ ట్రాన్స్‌కో) సంస్థకు సంబంధించిన అధికారిక, అంతర్గత సమాచారాన్ని పత్రికలు, మీడియా లేదా బయటి వ్యక్తులకు చేరవేసే వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. టీజీ ట్రాన్స్‌కో సీఎండీ ఆదేశాల మేరకు తాజాగా ఈ హెచ్చరికలతో కూడిన ఒక సర్క్యులర్‌ను జారీ చేశారు.
కొందరు అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఎలాంటి అనుమతులు లేకుండానే సంస్థ అంతర్గత వ్యవహారాలను మీడియాకు లీక్ చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి చర్యలు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, సంస్థ భద్రతను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. దీనివల్ల మీడియాలో అసంపూర్ణ, తప్పుదోవ పట్టించే కథనాలు వచ్చి సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
TG Transco Warning | ముందస్తు అనుమతి తప్పనిసరి..
సంస్థలో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగి, అధికారి లేదా ఆర్టిజన్ కూడా ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లతో మాట్లాడకూడదని, ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని కఠినంగా ఆదేశించారు. అంతేకాకుండా ఆఫీస్ క్యాంటీన్లు, కారిడార్లు, లిఫ్ట్‌లు, వెయిటింగ్ ఏరియాలు, బహిరంగ ప్రదేశాలు లేదా సామాజిక సమావేశాల్లో సంస్థకు సంబంధించిన సున్నితమైన విషయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చించవద్దని హెచ్చరించారు. ఈ నిబంధనలను శాఖల అధిపతులందరూ (HODs) తమ సిబ్బందికి స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చట్టపరమైన, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక జారీ అయింది.
ఇది కూడా చదవండి..: Konda Surekha Resignation | నేను తప్పు చేయలేదు, ఎందుకు రాజీనామా చేయాలి?: కొండా సురేఖ