అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Surekha Resignation | తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం అత్యంత ఆసక్తికరంగా మారింది. తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఎటువంటి తప్పు చేయనప్పుడు పదవికి ఎందుకు రాజీనామా చేయాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రి సురేఖ గట్టిగానే విభేదిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Konda Surekha Resignation | హైకమాండ్‌కు లేఖ..
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) నేరుగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పూర్తి వివరాలతో కూడిన ఒక లేఖను అందజేశారు. తనకు పార్టీలో తగిన న్యాయం చేయాలని ఆయనను కోరగా, ఈ సమస్యను పరిశీలిస్తామని ఖర్గే హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ప్రత్యేకంగా లేఖ పంపించినట్లు సురేఖ వెల్లడించారు.
Konda Surekha Resignation | సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదు..
తన కుమార్తె సుస్మిత చేసిన కొన్ని వ్యాఖ్యలను తన ఆపాదించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. సుస్మిత చేసిన కామెంట్లు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. మరోవైపు, సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపైనే హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం మధ్య ఇప్పటికే విస్తృతమైన చర్చలు జరిగినట్లు సమాచారం.
Konda Surekha Resignation | బర్తరఫ్‌పై జోరుగా ఊహాగానాలు..
మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే, కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసేందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వివాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ముఖేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితర సీనియర్ నేతల నుంచి అధిష్ఠానం ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది. ఈ బర్తరఫ్ పరిణామం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై పార్టీ వర్గాలు తీవ్రంగా దృష్టి సారించాయి.
ఇది కూడా చదవండి..: Telangana Fee Reimbursement | సచివాలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్ట్