అక్షరటుడే, వెబ్‌డెస్క్: IRCTC Package | పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ కొత్తకొత్త ప్యాకేజీలతో ముందుకు వస్తోంది. పూరీ, కాశీ, అయోధ్య వంటి పుణ్య క్షేత్రాలను ఒకే యాత్రలో చుట్టి వచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది.
భారతీయ రైల్వే (Indian Railways) అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ.. పర్యాటకులు, భక్తుల కోసం ‘పూరీ కామాఖ్య బైద్యనాథ్ ధామ్ యాత్ర’ పేరుతో మరో వినూత్నమైన ఆధ్యాత్మిక ప్యాకేజీని తీసుకువచ్చింది. దీని ద్వారా తూర్పు ఉత్తర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలను సందర్శించే అద్భుతమైన అవకాశం లభించనుంది. ఈ యాత్ర భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు ద్వారా జూన్ 25 ప్రారంభమై జూలై 6 న ముగుస్తుంది. 11 రాత్రులు, 12 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పూరీ జగన్నాథుడితోపాటు అయోధ్య రామయ్యను కాశీ విశ్వరుడిని దర్శించుకోవచ్చు.
IRCTC Package | పుణెలో ప్రారంభం..
పుణె నుంచి ప్రారంభమయ్యే ఈ రైలును లోనావాలా, నాసిక్, నాగ్‌పూర్ వంటి వివిధ స్టేషన్లలో కూడా ఎక్కే అవకాశం కల్పించడం వల్ల తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని ప్రయాణికులకు కూడా ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. మొదట ఒడిశా (Odisha)లోని పూరీకి తీసుకువెళ్తారు. ఇక్కడ ప్రఖ్యాత జగన్నాథ ఆలయంతో పాటు కోణార్క్ సూర్య దేవాలయం, చారిత్రక లింగరాజ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అనంతరం రైలు అసోంలోని గౌహతికి చేరుకుంటుంది. అక్కడ ప్రసిద్ధ కామాఖ్య దేవి శక్తిపీఠంతో పాటు నవగ్రహ ఆలయం, ఉమానంద ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత జసిదిహ్‌లోని ప్రసిద్ధ బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని, భోళా శంకరుడి ఆశీస్సులు తీసుకున్న తర్వాత రైలు వారణాసికి బయలుదేరుతుంది. కాశీ విశ్వనాథుని (Kashi Vishwanatha) దర్శనం చేసుకుని, సాయంత్రం వేళ గంగా హారతిని వీక్షించవచ్చు. ఈ యాత్ర చివరగా శ్రీరామచంద్రుడి జన్మస్థలమైన అయోధ్యకు చేరుకుంటుంది. భవ్య రామ మందిరంలో రామ్‌లల్లాను దర్శించుకోవచ్చు.
IRCTC Package | మూడు కేటగిరీలు..
‘పూరీ కామాఖ్య బైద్యనాథ్ ధామ్ యాత్ర’ పేరుతో తీసుకువచ్చిన ప్యాకేజీని ప్రయాణికుల సౌకర్యార్థం మూడు కేటగిరీలుగా చేశారు.
ఎకానమీ లేదా స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించాలనుకునే వారు ఒక్కొక్కరికి రూ. 22,770 చెల్లించాలి.
స్టాండర్డ్ లేదా థర్డ్ ఏసీ కేటగిరీ చార్జి రూ. 39,620.
కంఫర్ట్ లేదా సెకండ్ ఏసీ కేటగిరీ చార్జీ రూ. 52,860.
ప్యాకేజీలో రైలు టిÂకెట్లు, దర్శనీయ ప్రదేశాలకు వెళ్ళడానికి బస్సు సౌకర్యం, హోటల్ వసతి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి శాకాహార భోజనం ఉంటుంది. దీంతోపాటు యాత్రికులకు మార్గనిర్దేశం చేసేందుకు ఒక గైడ్ కూడా ఉంటారు.
IRCTC Package | వృద్ధుల కోసం లోయర్ బెర్త్‌లు..
వయోవృద్ధుల కోసం రైలులో పరిమిత సంఖ్యలో లోయర్ బెర్త్‌లను కూడా అందుబాటులో ఉంచారు. అయితే దీనికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 750 సీట్లు ఉన్న ఈ ప్రత్యేక రైలులో బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..: SBI Jobs | రాతపరీక్ష లేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగావకాశాలు!