Annamalai Resignation | బీజేపీకి అన్నామలై రాజీనామా.. సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Annamalai Resignation | తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం (TVK) ఏర్పాటైన తర్వాత అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు సమర్పించారు.

Annamalai Resignation | కూటముల్లో కుదుపు..

ఇటీవలి పరిణామాల తర్వాత ఏఐఏడీఎంకే (AIADMK) – బీజేపీ కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఏఐఏడీఎంకే లోని ఒక వర్గం ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటించడమే కాకుండా, అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది. ఇప్పుడు ఆ ప్రభావం బీజేపీపై కూడా పడినట్లు కనిపిస్తోంది. అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చి, సీఎం విజయ్ తరహాలోనే తమిళనాడులో సొంతంగా సరికొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అందుకు బలాన్ని చేకూరుస్తూ.. దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల్లో అన్నామలైకి మద్దతుగా పెద్ద ఎత్తున పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి.

annamalay.1

Annamalai Resignation | అధిష్ఠానంతో వరుస భేటీలు..

రాజీనామా సమర్పించడానికి ముందు అన్నామలై ఢిల్లీలో నితిన్ నబీన్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో కీలక సమావేశం నిర్వహించారు. కాగా, ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన నేరుగా చెన్నైకి బయలుదేరనున్నట్లు సమాచారం.

annamalay.2

Annamalai Resignation | ఆధిపత్య పోరే కారణమా?

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్‌ను నియమించినప్పటి నుంచి అన్నామలై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో తన భవిష్యత్తుపై ఒక స్పష్టతకు వచ్చినందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ అధిష్ఠానంతో ఎలాంటి ఘర్షణ పడకుండా, స్నేహపూర్వకంగానే విడిపోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా తన సొంత మార్గాన్ని ఎంచుకోబోతున్నట్లు ఇప్పటికే ఆయన పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Pawan Kalyan Farmhouse | యూట్యూబ్ బ్లాక్‌మెయిల్ దందా.. పవన్ ఆస్తిపై తప్పుడు మ్యాప్‌లతో దుష్ప్రచారం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *