Sachin Birthday | గిరిజన గ్రామంలో సాదాసీదాగా సచిన్ బర్త్‌డే.. పిల్లలతో ఆటలు, క్రీడా మైదానాల నిర్మాణానికి హామీ

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sachin Birthday | భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్క‌ర్ తన 53వ పుట్టినరోజును ఈసారి అత్యంత ప్రత్యేకంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఆయన బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్న సమయంలో, సచిన్ మాత్రం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh State)లోని గిరిజన ప్రాంతంలో చాలా సింపుల్‌గా హృదయాన్ని హత్తుకునే విధంగా తన పుట్టినరోజును జరుపుకోవడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా సచిన్ దంతేవాడ జిల్లా (Dantewada District)లోని చిందనార్ అనే దూర ప్రాంత గిరిజన గ్రామాన్ని సందర్శించారు. ఇంద్రావతి నది తీరంలో ఉన్న ఈ గ్రామానికి ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా చేరుకుని, అక్కడి స్థానిక గిరిజన పిల్లలతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు కుమార్తె సారా టెండూల్కర్ మరియు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Sachin Birthday | పిల్లలతో కేక్ కట్… వాలీబాల్ ఆడిన సచిన్

గ్రామంలో ఇటీవల నిర్మించిన క్రీడా మైదానంలో సచిన్ గిరిజన పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. “హ్యాపీ బర్త్‌డే సచిన్ సర్” అంటూ పిల్లలు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మొత్తం ఉత్సాహభరితంగా మారింది. పిల్లలతో సమయం గడిపిన సచిన్, వారితో వాలీబాల్ ఆడి వారిని ప్రోత్సహించారు. ‘క్రికెట్ గాడ్’ను ప్రత్యక్షంగా చూసిన ఆ చిన్నారుల ఆనందం చెప్పలేనిది. ఈ సందర్భంగా సచిన్ అక్కడి క్రీడా మైదానాన్ని పరిశీలించి, దాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిని సత్కరించారు. ప్రస్తుతం దంతేవాడ జిల్లాలో 25 క్రీడా మైదానాలు పూర్తయ్యాయి. ఇంకా మరో 25 మైదానాల నిర్మాణం కొనసాగుతోంది.

Sachin Birthday | తన ప్రయాణం ఈ మైదానంలోనే..

ఈ నేపథ్యంలో సచిన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ప్రతిభ ఉన్నా సరైన మైదానాలు లేకపోవడం గురించి తెలిసినప్పుడు తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని తెలిపారు. తాను కూడా ఒకప్పుడు మైదానంలోనే తన ప్రయాణాన్ని ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు. ఇకపై కేవలం 50 మాత్రమే కాకుండా, 100కి పైగా క్రీడా మైదానాల నిర్మాణానికి సహకరిస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి కొత్త దారులు తీసుకురానుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్, తన వినయంతో, సామాజిక బాధ్యతతో మరోసారి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

ఇది కూడా చదవండి..: Tilak Overton | ముంబై–చెన్నై మ్యాచ్‌లో తిలక్ వర్మ–ఓవర్టన్ మధ్య గొడ‌వ‌.. తర్వాత హగ్‌తో ఎమోష‌న‌ల్‌!

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *