Tilak Overton | ముంబై–చెన్నై మ్యాచ్‌లో తిలక్ వర్మ–ఓవర్టన్ మధ్య గొడ‌వ‌.. తర్వాత హగ్‌తో ఎమోష‌న‌ల్‌!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tilak Overton | వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ పూర్తిగా వన్‌సైడ్‌గా సాగింది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముందుగా చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న చెన్నై బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేశారు.

ముఖ్యంగా సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో రెచ్చిపోయి ఆడడంతో చెన్నై 20 ఓవర్లలో 207/6 అనే భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభం క‌లిసి రాలేదు. కేవలం 11 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ దానిష్ మాలేవర్ డకౌట్ కాగా, క్వింటన్ డికాక్ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఫామ్‌లో ఉన్న నమన్ ధీర్ కూడా డకౌట్ కావడంతో ముంబై టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది.

Tilak Overton | ర‌నౌట్ స‌మ‌యంలో గొడ‌వ‌..

ఈ దశలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కాస్త స్థిరంగా ఆడుతూ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో తొమ్మిదో ఓవర్‌లో జెమీ ఓవర్టన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్‌లో తిలక్ వర్మ ఒక్కసారిగా గేర్ మార్చి వరుస బౌండరీలతో దాడి ప్రారంభించాడు. మొదటి మూడు బంతుల్లోనే పది పరుగులు రాబట్టి మ్యాచ్‌పై కొంత ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ ఓవర్ చివరి బంతికి డబుల్ కోసం ప్రయత్నించిన తిలక్ వర్మకు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ “వద్దు” అని సంకేతం ఇచ్చాడు. దీంతో తిలక్ వెనక్కి తిరిగివచ్చాడు. ఈ క్రమంలో బౌలర్ జెమీ ఓవర్టన్ రనౌట్‌కు ప్రయత్నించగా, అక్కడే ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం చోటు చేసుకుంది. కోపంతో తిలక్ వర్మ ఏదో కామెంట్‌ చేయగా, ఓవర్టన్ కూడా వెంటనే స్పందించాడు.

Tilak Overton | అక్కడితో ముగిసింది..

ఈ ఉద్రిక్త పరిస్థితిని గమనించిన సూర్యకుమార్ యాదవ్ వెంటనే జోక్యం చేసుకున్నాడు. అంపైర్ కూడా పరిస్థితిని చక్కబెట్టడంతో వివాదం అక్కడితో ముగిసింది. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ (Tilak Varma), ఓవర్టన్ ఇద్దరూ హగ్ చేసుకోవడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక మ్యాచ్ ఫలితానికి వ‌స్తే, చెన్నై స్పిన్నర్ల ధాటికి ముంబై బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. సూర్యకుమార్ యాదవ్ (36), తిలక్ వర్మ (37) తప్ప మరెవరూ రాణించలేదు. ఫలితంగా ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌట్ అయి భారీ తేడాతో ఓటమి చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుతూ ఘన విజయం సాధించింది.

ఇది కూడా చదవండి..: Ekana Stadium Fight | ఏకనా స్టేడియంలో రచ్చ.. చెప్పులతో కొట్టుకున్న అభిమానులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *