అక్షరటుడే, వెబ్డెస్క్: T20 Ticket Black Marketing | భారత్–వెస్టిండీస్ టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్లను అడ్డదారిలో అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును గోషామహల్ పోలీసులు రట్టు చేశారు.
మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారన్న సమాచారంతో చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించిన 11 కాంప్లిమెంటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
T20 Ticket Black Marketing | సోషల్ మీడియానే ప్రచార వేదికగా..
టికెట్ల విక్రయానికి నిందితులు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ ప్రచారం చేసి, వాటిని అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. సాధారణంగా విక్రయానికి ఉద్దేశించని కాంప్లిమెంటరీ టికెట్లను ఇలా అమ్మకానికి పెట్టడం ఈ వ్యవహారంలో కీలకంగా మారింది.
T20 Ticket Black Marketing | హెచ్‌సీఏ సభ్యుడి ద్వారా టికెట్లు?
నిందితులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సభ్యుడి ద్వారా ఈ టికెట్లను పొందినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అసలు టికెట్లు ఎలా చేతులు మారాయి? వాటిని ఎవరు అందించారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
T20 Ticket Black Marketing | మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం
నిందితుల నుంచి 11 కాంప్లిమెంటరీ టికెట్లతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, ఒక సుజుకి యాక్సెస్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టికెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారాన్ని, సోషల్ మీడియా ప్రచారాన్ని పరిశీలిస్తూ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.
రేపు జరగనున్న భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్ నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి రావడం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ టికెట్ల కోసం ప్రయత్నించే అభిమానులు.. అనధికారిక వ్యక్తులు, సోషల్ మీడియా విక్రయ ప్రకటనలను నమ్మి మోసపోకూడదని సూచిస్తున్నారు.