అక్షరటుడే, కామారెడ్డి: Kalyana Lakshmi Fraud | పేదింటి ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు గత ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించింది. అయితే ఈ పథకాల లబ్ధి పొందేందుకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. అర్హత లేకున్నా ప్రభుత్వ నిధులు కాజేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు.
Kalyana Lakshmi Fraud | పథకాలతో పేదలకు లబ్ధి
ఈ పథకాల ద్వారా పెళ్లయిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం రూ.లక్ష చెక్కులను అందజేస్తుంది. ఈ పథకం ప్రారంభంలో నిజమైన లబ్ధిదారులకే మేలు చేసింది. కానీ డబ్బు ఎక్కువగా ఉండడంతో కొందరు ఈ పథకాన్ని సొమ్ము చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. అర్హత లేకపోయినా దరఖాస్తులు పెట్టి ప్రభుత్వ నిధులను కాజేయడానికి పథకాలు వేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం విజయవంతంగా కొనసాగడం, గెజిటెడ్ సంతకం చేసిన దరఖాస్తులకు ఆర్థిక ప్రయోజనం లభించడంతో కొందరు అక్రమార్కులు ఈ పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం మొదలుపెట్టారు. గెజిటెడ్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి చేసి క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా ఫోర్జరీ కేసులో కామారెడ్డి (Kamareddy)లో ముగ్గురు అరెస్ట్ కావడం జిల్లాలో కలకలం రేపుతోంది.
Kalyana Lakshmi Fraud | ఫోర్జరీ సంతకాలతో దరఖాస్తులు..
మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం దరఖాస్తుపై గెజిటెడ్ అధికారి సంతకాన్ని తప్పనిసరి చేసింది. కానీ అక్రమార్కులు దీన్నే ఆయుధంగా మార్చుకున్నారు. గెజిటెడ్ వైద్యులు, ఇతర అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ సీల్స్ వేసి దరఖాస్తులను సిద్ధం చేశారు. లబ్ధిదారులకు గెజిటెడ్ సంతకాలు చేయడానికి అధికారులు అంతగా ముందుకు రాకపోవడంతో కొందరు వ్యక్తులు తామే సంతకాలు చేయిస్తామని చెప్పి వసూళ్లకు తెరలేపారు.
Kalyana Lakshmi Fraud | భయపడుతున్న అధికారులు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు గెజిటెడ్ అధికారులు సంతకాలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎవరు అసలైన లబ్దిదారులో, ఎవరు కాదో తెలియని పరిస్థితి నెలకొంది. ఏదైనా విచారణ జరిగి అసలు లబ్దిదారులు కాదని తెలిస్తే తమ ఉద్యోగాలు పోతాయని అధికారులు భయపడుతున్నారు. దాంతో అధికారులు సంతకాలు చేయడానికి సాహసించడం లేదు. అర్హులైన నిజమైన లబ్ధిదారులు వచ్చి సంతకం కోసం అడిగినా గెజిటెడ్ అధికారులు జంకుతున్నారు. దీనివల్ల అసలు అర్హులకే ఈ పథకం అందకుండా పోతున్న పరిస్థితి ఏర్పడింది.
Kalyana Lakshmi Fraud | ఫోర్జరీ సంతకాల కేసులో ముగ్గురు అరెస్ట్
ఫోర్జరీ సంతకాలతో దరఖాస్తులు చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు అధికారి స్టాంప్ కూడా వేయడం కలకలం రేపింది. వారి వద్ద నుంచి నకిలీ సీల్స్, ఫారాలు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి అరెస్ట్‌తో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ముఠాలో ఇంకా ఎంత మంది ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Kalyana Lakshmi Fraud | బయటపడింది ఇలా..
భిక్కనూర్ మండలంలో కల్యా ణలక్ష్మి పథకం కోసం పలువురు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. 12 మందికి సంబంధించిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తుండగా కొన్ని దరఖాస్తులలో గెజిటెడ్ అధికారి సంతకం తేడాగా కనిపించడంతో అధికారులు సదరు గెజిటెడ్ వైద్యుడినికి సమాచారం అందించారు. దీంతో ఆయన సంతకం ఫోర్జరీ అయిందని గుర్తించారు. సదరు గెజిటెడ్ వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా భిక్కనూర్ మండల కేంద్రంలో ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడి తతంగం బయటపడింది. విచారణ చేపట్టిన పోలీసులు ఫోర్జరీ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో ఎంతమంది దరఖాస్తులకు సంతకాలు ఫోర్జరీ చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Nirmal Auto Driver Murder | సవతి తల్లితో వివాహేతర సంబంధం.. ఆటో డ్రైవర్ హత్య