అక్షరటుడే వెబ్‌డెస్క్: GCCX Hyderabad | హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వేదికగా ‘జీసీసీఎక్స్ హైదరాబాద్ 2026’ (GCCX Hyderabad 2026) సదస్సు అత్యంత వైభవంగా ముగిసింది. హైసీయా (HYSEA), 3ఏఐ (3AI) సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాలకు చెందిన 1,200 మందికి పైగా ప్రతినిధులు, 70 మందికి పైగా వక్తలు హాజరయ్యారు.
“ది లీడర్షిప్ ఇంపెరేటివ్ ఫర్ ఏఐ-నేటివ్ జీసీసీస్” (AI-Native GCCs) అనే ప్రధాన థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించారు. జీసీసీ కంట్రీ హెడ్స్, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలు, సీఐఓలు, సీటీఓలు, ఏఐ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఈ వేదికగా భవిష్యత్ గ్లోబల్ ఆపరేషన్లపై చర్చించారు. ప్రపంచ టెక్నాలజీ, జీసీసీ హబ్‌గా హైదరాబాద్ ప్రాముఖ్యతను ఈ సదస్సు మరింత చాటిచెప్పింది.
GCCX Hyderabad | ప్రధాన ముఖ్యాంశాలు, ఆవిష్కరణలు..
సదస్సులో భాగంగా ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (PwC) “మేకింగ్ వాల్యూ విజిబుల్ – ఎ క్రిటికల్ ఇంపెరేటివ్ ఫ్రమ్ టెక్నాలజీ జీసీసీస్” పేరిట రూపొందించిన ప్రత్యేక నివేదికను (వైట్‌పేపర్) విడుదల చేశారు. అలాగే, వర్ధమాన స్టార్టప్‌లు , టెక్ కంపెనీలకు చెందిన అత్యాధునిక ఏఐ సాంకేతికతలతో ఇన్నోవేషన్ జోన్‌ను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా జీసీసీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ‘జీసీసీ వన్ అవార్డ్స్ 2026’ అందజేసి ఘనంగా సత్కరించారు. వీటితో పాటు ఎగ్జిక్యూటివ్ బ్రేక్‌ఫాస్ట్ రౌండ్టేబుల్స్, నూతన నిబంధనలపై ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లను కూడా ఈ వేదికపై నిర్వహించారు.
GCCX Hyderabad | నాయకుల అభిప్రాయాలు..
హైసీయా ప్రెసిడెంట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ బిపిన్ పెంద్యాల మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అద్భుతమైన టాలెంట్ కారణంగా హైదరాబాద్ గ్లోబల్ జీసీసీ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందని తెలిపారు. 3ఏఐ సీఈఓ సమీర్ ధన్రాజాని మాట్లాడుతూ.. రాబోయే కాలమంతా ఏఐ-నేటివ్ జీసీసీలదేనని, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, నిరంతర నూతన ఆవిష్కరణల ద్వారానే భవిష్యత్తులో మెరుగైన వ్యాపార ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
కీలక చర్చనీయాంశాలు..
ఏఐ-నేటివ్ జీసీసీలు, ఎంటర్ప్రైజ్ ఏఐ స్వీకరణ, ఏజెంటిక్ ఏఐ, బాధ్యతాయుతమైన ఏఐ పాలన, సైబర్ సెక్యూరిటీ, మానవ-ఏఐ సహకారం వంటి కీలక అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో ఐటీ, ఐటీఈఎస్, జీసీసీ, స్టార్టప్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హైసీయా (1991లో స్థాపించారు).. హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది.