Egypt Earthquake | ఈజిప్టును కుదిపేసిన భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత..అప్రమత్తమైన ప్రభుత్వం

పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రి ఖలీద్ అబ్దెల్ ఘఫ్ఫార్ దేశవ్యాప్తంగా అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Egypt Earthquake | ఈజిప్టులో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. గ్రేటర్ కైరో ప్రాంతంతో పాటు పలు గవర్నరేట్లలో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Egypt Earthquake | తెల్లవారుజామున 3 గంటలకు

ఈజిప్టు నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ జియోఫిజిక్స్ (NRIAG) తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 3:00:36 గంటలకు భూకంపం సంభవించింది.

తొలుత దీని తీవ్రతను రిక్టర్ స్కేలుపై 5.2గా ప్రకటించిన సంస్థ, అనంతరం దానిని 5.5గా సవరించింది. భూకంప కేంద్రం తూర్పు కైరో ప్రాంతంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది.

Aug 03 Horoscope | గత పెట్టుబడులతో బంపర్ లాభాలు..ఈ రాశుల వారు జాక్‌పాట్ కొట్టినట్టే!

భూకంపం ఎంతసేపు కొనసాగిందన్న విషయాన్ని అధికారులు వెల్లడించకపోయినా, పలువురు స్థానికులు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు స్పష్టంగా అనుభవించినట్లు తెలిపారు.

Egypt Earthquake | అత్యవసర ప్రతిస్పందన డిక్లేర్​

భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం నమోదుకాలేదని NRIAG తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా సోమవారం ఉదయం వరకు భూకంపానికి సంబంధించిన గాయాలు, ఇతర అత్యవసర ఘటనలు నమోదు కాలేదని స్పష్టం చేసింది.

పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రి ఖలీద్ అబ్దెల్ ఘఫ్ఫార్ దేశవ్యాప్తంగా అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. అన్ని గవర్నరేట్లలోని అత్యవసర విభాగాలతో సమన్వయం చేస్తూ కేంద్ర సంక్షోభ నిర్వహణ కేంద్రాన్ని అప్రమత్తం చేశారు.

అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలు, ఐసీయూలు, అంబులెన్స్ సేవలు, ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు పూర్తిస్థాయి సంసిద్ధతతో ఉండాలని, మందులు, రక్తం, ఆక్సిజన్ తదితర నిల్వలు సమృద్ధిగా ఉంచాలని ఆదేశించారు.

Egypt Earthquake | సర్కారు హెచ్చరికలు..

అదే సమయంలో ఈజిప్టు రెడ్ క్రెసెంట్ కూడా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర చర్యలు ప్రారంభించింది. నిర్మాణపరంగా దెబ్బతిన్నట్లు అనుమానించే భవనాలకు దూరంగా ఉండాలని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ప్రజలకు సూచించింది.

మరోవైపు జర్మనీకి చెందిన జియోసైన్స్ పరిశోధనా సంస్థ (GFZ) ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు చేసింది. సూయెజ్ నగరానికి ఉత్తరంగా సుమారు 38 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.

ఈజిప్టులో భారీ భూకంపాలు అరుదుగా సంభవిస్తుంటాయి. అయితే 1992 అక్టోబర్‌లో కైరోను కుదిపిన 5.8 తీవ్రత గల భూకంపం దేశ ఆధునిక చరిత్రలో అత్యంత ఘోరమైనదిగా నిలిచింది. ఆ ఘటనలో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *