Meta Ultimatum | ప్రధాని వీడియో తొలగింపు అంశం..మెటాకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి కొంతసేపు తొలగించిన వ్యవహారంలో ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం మెటా సంస్థకు మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Meta Ultimatum | ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి కొంతసేపు తొలగించిన వ్యవహారంలో ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం మెటా సంస్థకు మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఆ లోపు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పార్లమెంట్ ప్యానెల్ అధ్యక్షుడు నిశికాంత్ దూబే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించే దేశ ప్రధాని వీడియోను తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడితో సమానమని పేర్కొన్నారు.

Meta Ultimatum | చట్టపరమైన చర్యలు..

ఈ వివాదంలో మెటా తగిన చర్యలు తీసుకోకపోతే, సోషల్ మీడియా కంపెనీలకు లభించే చట్టబద్ధ రక్షణ (సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్) రద్దు అవుతుందని ప్యానెల్ హెచ్చరించింది. ఈ క్లాజ్ తొలగిస్తే ప్లాట్‌ఫామ్ అధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. మెటా ఈ ఘటనకు ఆటోమేటిక్ సాంకేతిక లోపమే కారణమని గతంలో వివరణ ఇచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం , పార్లమెంట్ ప్యానెల్ ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఇది కేవలం టెక్నికల్ సమస్య కాదని, జాతీయ భద్రత , శాంతిభద్రతలకు సంబంధించిన కీలక అంశమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Meta Ultimatum | ఏం జరిగిందంటే?

నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థులు నిరసనలు చేపట్టిన సమయంలో ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. ‘‘స్నేహితులారా.. పేపర్ లీక్ అనేది సాధారణ అంశం కాదని నాకు తెలుసు..’’ అంటూ సాగిన ఈ జెన్-జీ స్టైల్ వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే, కొంతసేపు అది ఆయన ఖాతా నుంచి మాయం కావడం, ఆ తర్వాత మళ్లీ ప్రత్యక్షం కావడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో రాబోయే రోజుల్లో మెటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి:  SRSP Flood Inflow | ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద.. 36 టీఎంసీలకు చేరిన నీటినిల్వ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *