అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Roads | నాలుగైదు రోజులుగా కామారెడ్డి (Kamareddy) పట్టణంలో కురుస్తున్న వర్షాలకు రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై వర్షపు నీరు చేరి తారు లేచిపోయింది. ఫలితంగా చిన్నచిన్న గుంతలు కూడా పెద్దవిగా మారాయి. ప్రతి కూడలి, ప్రతి వీధిలో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవి రోడ్లేనా అంటూ పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kamareddy Roads | కామారెడ్డి పట్టణంలో..
పట్టణంలో 49వార్డులు ఉన్నాయి. సుమారు లక్షకు పైగా వరకు జనాభా ఉంది. ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏదో ఒక ప్రాంతం అని చెప్పలేని పరిస్థితి. ఉదయం ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో గుంతలను తప్పించుకుంటూ వాహనదారులు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో కిందపడి గాయాలపాలవడం, ఆటోలు, కార్ల సస్పెన్షన్ దెబ్బతింటున్నాయి. రాత్రి వేళల్లో సరైన వెళుతురు లేకపోవడంతో ప్రమాదాల తీవ్రత మరింత పెరిగింది.
Kamareddy Roads | ఎక్కడెక్కడ గుంతలో..
పట్టణంలోని కీలకమైన రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. ప్రజలు రోజూ వినియోగించే మార్గాల్లోనే అత్యధిక గుంతలు ఉన్నాయి. కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు, ఉద్యోగులు ఎక్కువగా వినియోగించే ఈ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. పాత బస్టాండ్ నుంచి పంచముఖి హనుమాన్ ఆలయం రోడ్డు గుండా కలెక్టరేట్ మార్గాన్ని భక్తులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా వాడతారు. కానీ ఇక్కడ గుంతల వల్ల నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు.
Kamareddy Roads | డెయిలీ మార్కెట్ చుట్టూ..
ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా ఉండే డెయిలీ మార్కెట్ చుట్టూ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంతల కారణంగా కూరగాయలు, ఇతర సరుకులతో వచ్చే వాహనాలు చెడిపోతున్నాయి. ఇతర మండలాలు, జిల్లాలను కలిపే సిరిసిల్ల రోడ్డు, దేవునిపల్లి రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం నరక ప్రాయంగా మారింది. నిజాంసాగర్ చౌరస్తాలోని మూలమలుపు, బేకరీ సమీపంలో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఇవే కాకుండా విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీతో పాటు పట్టణంలోని చాలా కాలనీ రోడ్లు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి.
Kamareddy Roads | రోడ్ల పరిస్థితులపై ప్రజల ఆవేదన..
రోడ్ల దుస్థితిపై పలుమార్లు మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖలకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు. పన్నులు సక్రమంగా వసూలు చేస్తున్నారు. కానీ కనీసం రోడ్లు బాగు చేయడం లేదు. ఎవరైనా ప్రాణాలు కోల్పోయిన తర్వాతనైనా స్పందిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో నీరు నిలవడంతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా భయపడుతున్నారు.
Kamareddy Roads | మున్సిపల్, ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం

పట్టణంలోని అంతర్గత రోడ్లన్నీ మున్సిపల్ పరిధిలో ఉండగా, సిరిసిల్ల రోడ్డు, దేవునిపల్లి రోడ్డు వంటి ప్రధాన రహదారులు ఆర్అండ్బీ ఆధీనంలో ఉన్నాయి. కానీ రెండు శాఖల అధికారులు కూడా బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకోలేదు. రోడ్లపై హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదాలు జరిగినా స్పందించని తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులున్నా పనులు చేయడం లేదా లేక ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Kamareddy Roads | మరమ్మతులు ఉంటాయా..?
మరో రెండు వారాల్లో వినాయక చవితి పండుగ వస్తోంది. పండుగ సందర్భంగా పట్టణంలో భక్తుల రద్దీ, ఊరేగింపులు, బజార్లలో రాకపోకలు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే గుంతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పండుగ సమయంలో పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన చెందుతున్నారు. కనీసం ప్రధాన రోడ్లపైనా తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గుంతలను వెంటనే పూడ్చకపోతే పెద్ద ప్రమాదాలు తప్పవని, అందుకు బాధ్యత మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులదే అవుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. పట్టణంలో రహదారుల పరిస్థితులపై ఆర్ అండ్ బి అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.
Kamareddy Roads | రూ.40 లక్షలు మంజూరయ్యాయి
– పర్వతాలు, మున్సిపల్ కమిషనర్
పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. వీటి మరమ్మతుల నిధుల కోసం కలెక్టర్‌ను కోరగా ఎస్డీఆర్ఎఫ్ ఫండ్స్ నుంచి రూ.40లక్షలు మంజూరు ఇచ్చారు. ఈ నిధులను వార్డుల వారీగా కేటాయించాం. అయితే పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ కావాల్సి ఉంది. రెండుమూడు రోజుల్లో టెండర్ పూర్తి చేసి పనులు మొదలు పెడతాం.
ఇది కూడా చదవండి..: Cyber Crime Awareness | సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య