Ganga Gaya Sangam Yatra | గంగా గయ సంగమ యాత్ర.. మరో టూర్ ప్యాకేజీతో ఐఆర్సీటీసీ రెడీ

ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునేవారికోసం ఐఆర్సీటీసీ ఎప్పటికప్పుడు కొత్తకొత్త టూర్ ప్యాకేజీలను తీసుకువస్తుంటుంది. గంగా గయ సంగమ యాత్ర పేరుతో విమాన టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ganga Gaya Sangam Yatra | ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునేవారికోసం ఇండియన్ రైల్వే (Indian Railways) క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సెప్టెంబర్ 2న ప్రారంభమయ్యే ఈ యాత్ర.. 7 రాత్రులు, 8 పగళ్లు సాగుతుంది. కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది. ‘గంగా గయ సంగమ యాత్ర’ పేరుతో తీసుకువచ్చిన ఈ విమాన టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. విమాన టికెట్లు, హోటల్ బస, ఆహారం, బస్సు ప్రయాణం అన్నీ ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. యాత్ర ప్రత్యేకతలు తెలుసుకుందామా..

Ganga Gaya Sangam Yatra | 7 రాత్రులు, 8 పగళ్లు..

గంగా గయ సంగమ యాత్ర 7 రాత్రులు, 8 పగళ్లు సాగుతుంది. సెప్టెంబర్ 2న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. గయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం వంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో హైదరాబాద్ -గయ , లక్నో -హైదరాబాద్ రానుపోను విమాన టికెట్లు, 7 రాత్రుల హోటల్ వసతి, 7 బ్రేక్‌ఫాస్ట్‌లు, 7 డిన్నర్లు, మధ్యాహ్న భోజనం, బస్సు, ప్రయాణ బీమా, ఒక టూర్ ఎస్కార్ట్ సౌకర్యాలు కల్పిస్తారు. ఆలయ ప్రవేశ రుసుములు, అదనపు భోజనాలు, స్థానిక ఆటో చార్జీలు వంటివి ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

Ganga Gaya Sangam Yatra | యాత్ర వివరాలు..

మొదటి రోజు : సెప్టెంబర్ 2న ఉదయం 11.55 గంటలకు హైదరాబాద్‌లో విమానం బయలుదేరుతుంది. సాయంత్రం 4.30 గంటలకు బీహార్‌లోని గయకు చేరుకుంటుంది. ప్రసిద్ధ మహాబోధి ఆలయం, బౌద్ధ దేవాలయాలను సందర్శన అనంతరం రాత్రి గయలో బస కల్పిస్తారు.

రెండవ రోజు : సెప్టెంబర్ 3న ఉదయం విష్ణుపాద ఆలయం, మంగళ గౌరి శక్తిపీఠం దర్శనం అనంతరం రోడ్డు మార్గంలో ప్రయాణించి వారణాసికి చేరుకుంటారు. రాత్రి వారణాసిలోనే బస ఉంటుంది.

మూడో రోజు : సెప్టెంబర్ 4న కాశీ విశ్వనాథ ఆలయం దర్శనం, గంగా హారతి, స్థానిక ఆలయాల సందర్శన ఉంటుంది. ఘాట్‌లు, ఇరుకైన సందుల్లో బస్సులు వెళ్లలేవు కాబట్టి ప్రయాణికులే ఆటో లేదా ఇ-రిక్షాలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

నాలుగో రోజు : సెప్టెంబర్ 5న బౌద్ధ కేంద్రమైన సారనాథ్ పర్యటన.

ఐదో రోజు : సెప్టెంబర్ 6న వారణాసి నుంచి బయలుదేరి ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. అక్కడ అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమ సందర్శన ఉంటాయి. అనంతరం అయోధ్యకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

ఆరో రోజు : సెప్టెంబర్ 7న ఉదయం రామ జన్మభూమితో పాటు ఇతర ఆలయాలను సందర్శించుకున్న తర్వాత లక్నోకు తీసుకువస్తారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.

ఏడో రోజు : సెప్టెంబర్ 8న లక్నో సమీపంలోని పురాతన నైమిశారణ్యం సందర్శన.

ఎనిమిదో రోజు : సెప్టెంబర్ 9న ఉదయం లక్నోలోని బడా ఇమాంబారా చూసి, రాత్రి 8.45 గంటలకు లక్నోలో విమానం ఎక్కి రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Ganga Gaya Sangam Yatra | టికెట్ ధరలు…

Ganga Gaya Sangam Yatra

హోటల్ గదిని పంచుకునే విధానంపై ప్యాకేజీ రేట్లు ఆధారపడి ఉంటాయి.
సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 54,800.
ఇద్దరు వ్యక్తులు ఒక గదిని షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ. 41 వేలు.
ముగ్గురు షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ. 38,750.

ఇది కూడా చదవండి..: Instagram CSAM Ads | చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *