Digital Assembly Telangana | డిజిటల్ అసెంబ్లీ దిశగా అడుగులు.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన

తెలంగాణలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Digital Assembly Telangana | తెలంగాణలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ( Sridhar Babu )వెల్లడించారు. ఐటీసీ కాకతీయలో ‘గవ్ కనెక్ట్’, ‘మీసేవా’ సంయుక్తంగా నిర్వహించిన ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఏఐ, బ్లాక్‌చెయిన్, డేటా అనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి వినూత్న సాంకేతికతలను పాలనలో భాగం చేస్తూ పౌర సేవలను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్ఛేంజ్, వాట్సాప్ ద్వారా పౌర సేవలు, రియల్ టైమ్ గవర్నమెంట్ డ్యాష్‌బోర్డ్ వంటి సంస్కరణలతో తెలంగాణను డిజిటల్ గవర్నెన్స్‌లో ముందంజలో నిలిపినట్లు వివరించారు.

Digital Assembly Telangana | ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు..

పౌరుల సమాచార భద్రత కోసం బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు టీ-ఫైబర్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తూ, డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్‌తో ప్రభుత్వ శాఖల్లో పూర్తిస్థాయి కాగిత రహిత (పేపర్‌లెస్) పాలన అమలు చేస్తామని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన ప్రభుత్వ సేవలను నేరుగా వారి ఇంటి వద్దకే చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు, సాంకేతిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘హిప్లెక్స్-2026’ అంతర్జాతీయ ప్లాస్టిక్స్, పాలిమర్స్, ప్రాసెసింగ్ టెక్నాలజీ ప్రదర్శనను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లను అధిగమించి, కొత్త అవకాశాలుగా మలుచుకోవాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు.

sridhar babu

Digital Assembly Telangana | పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వ మద్దతు..

ప్రతికూల సమయాల్లోనూ ఆవిష్కరణలు, నూతన సాంకేతికతపై పెట్టుబడులు పెట్టే పరిశ్రమలే భవిష్యత్తును ఏలుతాయని స్పష్టం చేశారు. యంత్రాల వెనుక వేలాది కుటుంబాల జీవనోపాధి, పారిశ్రామికవేత్తల సంకల్పం దాగి ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైద్యం, మౌలిక వసతులు, వ్యవసాయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక కీలక రంగాలకు ప్లాస్టిక్ పరిశ్రమలే ప్రధాన ఆధారమని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 లక్షల టన్నులుగా ఉన్న పాలిమర్ వినియోగం, ప్రభుత్వం-పరిశ్రమల భాగస్వామ్యంతో 2030 నాటికి 20 లక్షల టన్నులకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Revanth Reddy Mulugu Visit | ములుగులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *