అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Prohibited Lands | రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను గతంలో నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో వాటి క్రయవిక్రయాలు నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమ భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
నిషేధిత ఆస్తుల పీవోబీ (POB) / 22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి భూములను తమ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తామని స్పష్టం చేశారు. భూముల రెగ్యులరైజ్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ల అనుమతులు తదితర వివరాలతో కూడిన అన్ని డాక్యుమెంట్లను ఈనెల 14వ తేదీ లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
Prohibited Lands | కఠిన చర్యలు తీసుకుంటాం
సచివాలయంలోని తన కార్యాలయంలో నిషేధిత భూములపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 22ఎకు సంబంధించి ప్రజావాణితో పాటు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పీవోబీ దరఖాస్తులకు సంబంధించిన అర్జిలను ప్రతి రోజూ సమీక్షించాలని ఆదేశించారు. 22ఎ పేరిట ఉద్దేశపూర్వకంగా అర్హులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ఏ చిన్న తప్పుచేసినా క్షమించేదిలేదు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీవోబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకుండా మూడు రోజుల సమయం తీసుకొని ఎందుకు తిరస్కరించవలసి వస్తుందన్న వివరాలను తెలియజేయాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : Cheyutha Pension Scheme | తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్లకు రంగం సిద్ధం