అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET UG Paper Leak | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG 2026) పేపర్ లీక్ కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో సీబీఐ సమర్పించిన సుమారు 20 వేల పేజీల సమగ్ర ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ (Delhi)లోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇవాళ పరిగణనలోకి తీసుకుంది.
ఈ కుట్రలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) లోపాలు, అక్రమాలకు సంబంధించిన పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును అత్యంత శాస్త్రీయంగా విచారించిన సీబీఐ.. కోర్టుకు సమర్పించిన దాఖలాల్లో పక్కా ఆధారాలను పొందుపరిచింది. మొత్తం 13 మందిని ప్రధాన నిందితులుగా పేర్కొన్న సీబీఐ.. ఛార్జ్‌షీట్‌తో పాటు 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 కీలక పత్రాలు, 43 డిజిటల్, ఫిజికల్ ఎవిడెన్స్‌లను కోర్టు ముందుంచింది. నిందితులు ఒక్కో పేపర్‌కు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి.
NEET UG Paper Leak | ఎన్‌టీఏ నిపుణుల హస్తం..
ఈ పేపర్ లీక్ కుట్ర వెనుక ఎన్‌టీఏకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ముగ్గురు సబ్జెక్ట్ నిపుణుల హస్తం ఉన్నట్లు సీబీఐ ఆధారాలతో సహా ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. లీకేజీ ముఠా నిర్వాహకులు, మీడియేటర్లు, ఎన్‌టీఏ నిపుణులతో కలిపి మొత్తం 13 మందిని ప్రధాన నిందితులుగా చేర్చారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని డీలక్స్ రూమ్‌ను ‘స్పెషల్ సీక్రెట్ క్లాస్ రూమ్’గా మార్చి ఈ అక్రమాలకు పాల్పడ్డారు. లాతూర్‌లోని రేణుకా ఈ-కెరీర్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోతేగావ్‌కర్ కుమారుడి కోసం ఈ రహస్య తరగతులు నిర్వహించారు. ఎన్‌టీఏకు చెందిన కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణుడు ప్రహ్లాద్ విఠల్‌రావు కులకర్ణి స్వయంగా ప్రశ్నల కాగితాల బండిల్‌తో అక్కడకు వచ్చి, కెమిస్ట్రీకి సంబంధించిన 132 ప్రశ్నలు, వాటి సమాధానాలను సదరు విద్యార్థి చేత నోట్‌బుక్‌లో రాయించారు.
NEET UG Paper Leak | పేపర్ లీక్‌లో కీలక పాత్ర..
ఏప్రిల్ 18, 19, 22 తేదీల్లో సిద్ధివినాయక ఆసుపత్రిలోనే గంటల తరబడి ఈ ప్రశ్నల సమాధానాల సాధన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఆసుపత్రి యజమాని మనోజ్ శిరూరే కూడా అక్కడికి వచ్చి ఈ పేపర్ లీక్‌లో కీలక పాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. పరీక్ష ముగిసిన అనంతరం సమాధానాలు రాసుకున్న ఆ నోట్‌బుక్‌ను పాత సామాన్లు కొనే వ్యక్తికి అమ్మేసినట్లు విద్యార్థి సీబీఐ విచారణలో అంగీకరించాడు. కాగా, ఈ కేసులో నిందితులపై ఆరోపణల నమోదు (Charge Framing) అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో త్వరలోనే కీలక వాదనలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Amit Shah Resignation | అమిత్ షా రాజీనామా చేయాలి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు