Private Hospital Room Rent | గదుల అద్దె నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి.. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు..

మెట్రో నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల రూమ్ రెంట్.. ఆయా ప్రాంతాల్లోని త్రీ-స్టార్ హోటల్ గది అద్దెను మించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Private Hospital Room Rent | మెట్రో నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల రూమ్ రెంట్.. ఆయా ప్రాంతాల్లోని త్రీ-స్టార్ హోటల్ గది అద్దెను మించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక లేదా సంక్లిష్టమైన వైద్య చికిత్సలు ప్రారంభించడానికి ముందే.. అయ్యే మొత్తం ఖర్చు అంచనాను (Cost Estimation) ఆస్పత్రులు రోగి కుటుంబానికి తప్పనిసరిగా లిఖితపూర్వకంగా అందించాలని సిఫార్సు చేసింది.

Private Hospital Room Rent | ప్రత్యేక ఆర్థిక సలహాదారులు..

చికిత్స ఖర్చులు, ఇన్సూరెన్స్ పరిమితులు, స్వచ్ఛంద సంస్థల సాయం వంటి వివరాలను రోగులకు స్పష్టంగా వివరించేందుకు ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ‘ఫైనాన్షియల్ నేవిగేటర్లను’ నియమించాలని తెలిపింది. ప్రాథమిక పరీక్షల నుంచి ఆపరేషన్, ఆ తర్వాత అందించే సేవలను ఒకే ప్యాకేజీ పరిధిలోకి తేవాలని పేర్కొంది. ఖరీదైన క్యాన్సర్, అరుదైన వ్యాధుల చికిత్సల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు, విరాళాలతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా అత్యవసర మందులను సరఫరా చేయాలని వెల్లడించింది.

Private Hospital Room Rent | ప్రైవేట్ వైద్యంపైనే 70 శాతం జనాభా ఆధారం

దేశంలో ప్రైవేట్ వైద్యం ఎంత భారంగా మారిందో పార్లమెంట్ కమిటీ (Parliamentary Committee) తన నివేదికలో గణాంకాలతో సహా వివరించింది. దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది ప్రైవేట్ ఆస్పత్రులపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పోలిస్తే ప్రైవేట్ వైద్యం 5 నుంచి 10 రెట్లు ఖరీదైనదిగా ఉంది. జాతీయ ఆరోగ్య ఖాతాల (NHA 2022-23) నివేదిక ప్రకారం.. 49.9 శాతం మంది తమ వైద్య ఖర్చులను స్వయంగా జేబుల్లో నుంచే భరిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ప్రతిసారి ఒక కుటుంబం సగటున రూ.34,064 వరకు ఖర్చు చేస్తోంది.

వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఏటా 12 నుంచి 13 శాతం మేర పెరుగుతుండగా.. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో కేవలం 1.43 శాతంగానే ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భారీ ఆర్థిక భారం నుంచి రోగులను రక్షించేందుకు, ఇష్టానుసారంగా పెంచుతున్న గదుల అద్దెలు, వైద్య ప్యాకేజీల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రామాణిక మార్గదర్శకాలను తీసుకురావాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: NEET UG Paper Leak | నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. కోర్టు ముందుకు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *