అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi Protest Violence | పార్లమెంట్ సమీపంలో జూలై 20న జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి నమోదైన మొదటి FIRలో హత్యాయత్నం అభియోగాలతో పాటు ఇతర అనేక తీవ్రమైన నిబంధనలను పోలీసులు చేర్చారు. ఈ ఆందోళనల్లో అసాంఘిక శక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) నిరసనల్లో భాగంగా ఈ నెల 20న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమతి లేకున్నా.. ఆందోళనకారులు బారికేడ్లను పగలగొట్టి పార్లమెంట్ వైపు వెళ్ళేలా కొందరు వ్యక్తులు గుంపును రెచ్చగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, నిరసనకారులు పోలీసు సిబ్బందిని చుట్టుముట్టి, వారిపై దాడి చేసి, రాళ్లు, చెప్పులు విసిరారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్ఆనరు.
Delhi Protest Violence | 129 మంది పోలీసులకు గాయాలు
పోలీసు సిబ్బంది ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతో గుంపు దాడి చేయగా, పలువురు పోలీసులు గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తి, ప్రైవేట్ వాహనాలకు కూడా నష్టం వాటిల్లిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పార్లమెంట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగించారని అధికారులు పేర్కొన్నారు. జూలై 20 నాటి ఘర్షణల్లో 129 మంది పోలీసు సిబ్బంది, 60 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని తెలిపారు. ఈ నిరసనలకు సంబంధించి 15 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదయ్యాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Delhi Protest Violence | నిందితుల గుర్తింపు
నిరసన ప్రదేశానికి వచ్చిన అసాంఘిక శక్తులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. వీటి సహాయంతో జంతర్ మంతర్‌కు వస్తున్న అసాంఘిక శక్తులను ఢిల్లీ పోలీసులు గుర్తిస్తున్నారు. నేర చరిత్ర ఉండి జంతర్ మంతర్‌కు వచ్చిన వ్యక్తులను ఇప్పటివరకు 2,000 మందికి పైగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జులై 20న రాళ్లు రువ్వడం, హింసను ప్రేరేపించడం వెనుక సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. జంతర్ మంతర్ వద్దకు వచ్చిన వారిలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించామని పోలీసులు పేర్కొనగా, దీనిపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ప్రతినిధి అశుతోష్ రంకా స్పందించారు. విద్యార్థుల తలలు పగలగొట్టడం, వారిని వీధుల్లో ఈడ్చుకెళ్లడం, వాలంటీర్ల పక్కటెముకలు విరగ్గొట్టడం వంటి చర్యలకు పాల్పడిన పోలీసు సిబ్బంది జాబితాను తాము ఢిల్లీ పోలీసులకు అందజేస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: Amarnath Yatra Resumes | అమర్నాథ్ యాత్ర పున: ప్రారంభం