LPG Production Targets | ఎల్‌పీజీ ఉత్పత్తిపై కేంద్రం కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్‌డెస్క్: LPG Production Targets | పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి  ( Hormuz Strait ) మూసివేత నేపథ్యంలో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగానే ఎల్‌పీజీ నిల్వలను సమకూర్చుకునే ఉద్దేశంతో పబ్లిక్, ప్రైవేట్ రంగ రిఫైనరీలు , చమురు వెలికితీసే కంపెనీలకు ఎల్‌పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. ఈ విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా టార్గెట్లు కేటాయించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 21 కంపెనీలు కలిసి రోజుకు 63,810 టన్నుల ఎల్‌పీజీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

LPG Production Targets | దిగుమతులపైనే అధిక భారం..

భారత్‌లో వంట గ్యాస్ వినియోగం భారీగా పెరిగింది. ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే దేశంలో 33.2 మిలియన్‌ టన్నుల ఎల్‌పీజీ (రోజుకు సగటున 91 వేల టన్నులు) వినియోగం జరిగింది. ఇందులో దేశీయంగా ఉత్పత్తి అవుతోంది కేవలం 13.1 మిలియన్‌ టన్నులు (రోజుకు 35,900 టన్నులు) మాత్రమే. మిగిలిన 21.3 మిలియన్‌ టన్నులను (రోజుకు 58,400 టన్నులు) విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే దాదాపు 64 శాతం గ్యాస్ కోసం మనం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

LPG Production Targets | ముందస్తు చర్యలు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి మూతపడడంతో ఈ సంక్షోభం బయటపడింది. మన దేశానికి దిగుమతి అయ్యే ఎల్‌పీజీలో 90 శాతం ఈ మార్గం ద్వారానే వస్తుండటంతో తీవ్ర కొరత ఏర్పడింది. అప్పట్లో ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్లపై ఆంక్షలు పెట్టి, గృహ వినియోగ సిలిండర్ బుకింగ్ గడువును పెంచాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.

LPG Production Targets | కంపెనీల వారీగా ఉత్పత్తి లక్ష్యాలు..

కొత్త ఆదేశాల ప్రకారం ప్రతి ఆరు నెలలకు (జనవరి 1, జులై 1 తేదీల్లో) దేశ అవసరాలకు తగినట్లుగా కొత్త లక్ష్యాలను ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని ప్రకారం కంపెనీల వారీగా కేటాయింపులు చూస్తే.. ప్రభుత్వ రంగంలోని 18 రిఫైనరీలకు రోజువారీగా 31,470 టన్నుల ఉత్పత్తి లక్ష్యం కేటాయించగా, ప్రైవేట్ రంగంలో అత్యధికంగా రిలయన్స్‌కు రోజుకు 18,000 టన్నుల టార్గెట్ ఇచ్చారు. అలాగే నయారా ఎనర్జీకి 4,480 టన్నులు, ఓఎన్‌జీసీ, గెయిల్ వంటి మహారత్న కంపెనీలకు 6,460 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఇది కూడా చదవండి:  Dimaagi Naxals | ‘మేధో నక్సల్స్​’ వ్యాఖ్యలు వారిని ఉద్దేశించి కాదు : కేంద్ర మంత్రి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *