POCSO Case Investigation | పోక్సో కేసుల విచారణలో వేగం పెంచాలి: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో నమోదైన పోక్సో కేసులపై సీపీ సాయిచైతన్య సమీక్షించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: POCSO Case Investigation | నిజామాబాద్ (Nizamabad)​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో నమోదైన పోక్సో కేసులపై సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) ప్రత్యేకంగా సమీక్షించారు. సీపీ కార్యాలయంలో ఆదివారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

POCSO Case Investigation | ఒక్కోకేసు పరిశీలన

జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చిన్నారులపై లైంగిక దాడులు, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను ఒక్కొక్కటిగా సీపీ పరిశీలించారు. ఆయా కేసుల్లో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, నిందితుల గుర్తింపు, అరెస్టులు, సేకరించిన ఆధారాలు, సాక్షుల వివరాలు, బాధిత చిన్నారుల వాంగ్మూలాలు, కేసుల ప్రస్తుత స్థితిగతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి కేసులో దర్యాప్తు ఏ దశలో ఉందనే విషయాన్ని క్షుణ్ణంగా సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న అంశాలను గుర్తించారు.

POCSO Case Investigation | నిందితులను త్వరగా పట్టుకోవాలి

నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని.. బాధిత చిన్నారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా దర్యాప్తును వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని సీపీ అధికారులతో పేర్కొన్నారు. పోక్సో కేసుల్లో చిన్నారుల భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాధితుల పట్ల సున్నితమైన వైఖరితో వ్యవహరించాలన్నారు. కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షలను త్వరితగతిన పూర్తి చేయించి నివేదికలు పొందాలని ఆదేశించారు. అదేవిధంగా బాధితులు, నిందితులకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.

POCSO Case Investigation | కేసుల్లో ఆధారాలను బట్టి..

కేసుల్లో లభించిన సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, ఇతర సాంకేతిక ఆధారాలను నిబంధనల ప్రకారం సేకరించి, వాటిని దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సాయిచైతన్య సూచించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక ఆధారాలను పకడ్బందీగా నమోదు చేసి కేసులు కోర్టులో బలంగా నిలిచేలా దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. డీసీపీ (అడ్మిన్) శుభంప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేషం, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ ఆర్.అంజయ్య పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Priyanka Murder Case | డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తునకు ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ నియామకం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *