అక్షరటుడే వెబ్‌డెస్క్: Dimagi Naxal Party | దేశంలో డిజిటల్ నిరసనల శైలి వేగంగా మారుతోంది. గతంలో నీట్ (NEET) పరీక్ష వివాదం తీవ్ర కలకలం రేపిన వేళ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన సోషల్ మీడియా ప్రచారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం అనూహ్య విప్లవంగా మారింది. సీజేపీ నేతృత్వంలో సాగిన ఈ ఉద్యమానికి ఊహించని రీతిలో మద్దతు లభించడంతో కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్‌లో పడక తప్పలేదు. సీజేపీ పోరాట తీవ్రతకు దిగివచ్చిన మోదీ సర్కార్ ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాల్సి వచ్చింది.
ఈ కాక్రోచ్‌ల ఉద్యమం సక్సెస్ కావడంతో ఆ వెంటనే సోషల్ మీడియాలో ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ (RHA), ఇథనాల్ బ్లెండెడ్‌కు నిరసనగా ‘ఈ-20 జనతా పార్టీ’ పేరుతో మరో సెటైరికల్ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ రెండు అంశాలపై దేశవ్యాప్తంగా మంచి ఆదరణే వచ్చింది.
Dimagi Naxal Party | ‘దిమాగీ నక్సల్స్’ వివాదం ..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింకల వ్యాఖ్యలు దేశ రాజకీయాలను షేక్ చేయగా, తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi )ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం మరో ఆన్‌లైన్ ఆందోళనకు వేదికగా మారింది. మోదీ తన స్పీచ్‌లో “దిమాగీ నక్సల్స్” అనడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాజాగా సోషల్ మీడియాలో ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ’ (DNJP) పేరుతో కొత్తగా సెటైరికల్ ఖాతా ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది.
Dimagi Naxal Party | రాత్రికి రాత్రే భారీగా ఫాలోవర్లు..
వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే ‘దిమాగీ నక్సల్ పార్టీ’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 2,04,000 (204K) ఫాలోవర్లను సంపాదించి రికార్డు సృష్టించింది. ఈ అకౌంట్‌లో 77 పోస్ట్ట్‌లను పోస్ట్ చేయగా, సుమారు 38 మందిని ఫాలో అవుతోంది. దీంతో సీజేపీ తరహాలోనే దిమాగీ నక్సల్ పార్టీ కూడా ఇప్పుడో ఉద్యమంగా మారుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ దిమాగీ నక్సల్స్ పార్టీతో పాటు ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ’ పేరుతో ఉన్న మరొక ఖాతాకు కూడా వేలలో ఫాలోవర్లు చేరారు. “ఆలోచించండి, పరిశోధించండి, ప్రతిఘటించండి” అనే నినాదంతో ఈ ఖాతాలు నడుస్తున్నాయి.
Dimagi Naxal Party | సైబర్ దాడుల ఆరోపణలు..
ఆగస్టు 2026లో ప్రారంభమైన తమ ఖాతాలపై సైబర్ దాడులు జరుగుతున్నాయని, గొంతులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దిమాగీ నక్సల్ పార్టీ ఎక్స్ (X) వేదికగా ఆరోపించింది. తాము భగత్ సింగ్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నామని పోస్టులలో వెల్లడించింది. దేశంలో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో పెద్దగా తీవ్రస్థాయి ఉద్యమాలేవీ ఊపందుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మోడీ వ్యాఖ్యలకు నిరసనగా దిమాగీ నక్సల్స్ పేరుతో కొత్త ఖాతా పుట్టుకురావడం దేశంలో మారుతున్న ఉద్యమ రూపాలకు నిదర్శనం అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Rare Stone Fraud | రాయికి మహిమలు ఉన్నాయని మోసం.. ఆరుగురి అరెస్ట్