అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Philippines Migration Policy | ప్రపంచంలోనే మెరుగైన వలస విధానం అమలు చేస్తున్న ఫిలిప్పీన్స్ దేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ మూడు రోజుల స్టడీ టూర్ చేపట్టింది. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమానికి సమగ్ర విధానం రూపొందించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas), నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి (MLA Bhupati Reddy) తెలిపారు.
Philippines Migration Policy | తొలిరోజు ఉన్నతస్థాయి సమావేశం
తొలిరోజు మంగళవారం మనీలా నగరంలోని ఇబీస్ స్టైల్స్ అరేనేట కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ బృందం పాల్గొంది. ఫిలిప్పీన్స్ లేబర్ మైగ్రేషన్, సివిల్ సొసైటీ సంస్థల స్పందన, లేబర్ మైగ్రేషన్ గవర్నెన్స్, అంతర్జాతీయ కార్మిక సంఘాల విధానాలు, గ్లోబల్ మైగ్రేషన్ యాక్షన్ ప్లాన్, లేబర్ మైగ్రేషన్ కారిడార్ల అనుభవాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ గల్ఫ్ ఎన్నారై పాలసీని రూపొందించడంతో పాటు ‘గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Philippines Migration Policy | నివేదిక రూపొందిస్తాం
ఫిలిప్పీన్స్‌లో అమలవుతున్న వలస విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణకు అనువైన అంశాలను గుర్తించి సమగ్ర నివేదిక రూపొందిస్తామని తెలిపారు. ఈ నివేదిక రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి మెరుగైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో ఉపయోగపడుతుందని చెప్పారు. స్టడీ టూర్ రెండో రోజు బుధవారం తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు మనీలాలోని ఇండియన్ ఎంబసీని సందర్శించారు. భారత రాయబారి హర్ష్ కుమార్ జైన్, ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్‌లతో వలస కార్మికుల సంక్షేమం, వలస విధానాలు, విదేశాల్లో భారతీయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బి.ఎం. వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రొఫెసర్లు విజయ్ కొర్ర, జునుగూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Konda Susmitha Parakala | సీఎం మీరా.. లేక ఆయనా? – రేవంత్‌రెడ్డికి కొండా సుస్మిత ప్రశ్న