అక్షరటుడే వెబ్‌డెస్క్: 105-Year-Old Prisoner | సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టు ( Supreme Court )ఊరటనిచ్చింది. ఆయనకు గతంలో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌నే అంతిమ నిర్ణయంగా పరిగణిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇకపై ఆయన ఎటువంటి అరెస్టు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించవచ్చని తేల్చిచెప్పింది.
105-Year-Old Prisoner | కేసు వివరాలు..
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన రసిక్ చంద్ర మోండల్ (105) దాదాపు 40 సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 1994లో స్థానిక కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన కలకత్తా హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ తొలి దశలో ఎలాంటి ఉపశమనం లభించలేదు.
105-Year-Old Prisoner | సుప్రీంకోర్టులో పిటిషన్..
తన వయసు ప్రస్తుతం 99 ఏళ్లు దాటిందని, వృద్ధాప్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నానని పేర్కొంటూ మోండల్ 2020లో ముందస్తు విడుదలను కోరుతూ మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం 2024 నవంబర్‌లో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా భారత ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ వయసును, అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసుకు సంబంధించిన విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, ఆయనకు మిగిలిన శిక్షను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Tamil Nadu free cars | ఉచిత కార్లు మాకొద్దు.. డీఎంకే ఎమ్మెల్యేల ప్రకటన