Pocharam Srinivas Reddy | పోచారం దారెటు..? క్యాడర్​లో గందరగోళం..

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీలో నేతలు ఎవరికి వారే అన్నట్టుగా కొనసాగుతున్నారన్న చర్చ సాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Pocharam Srinivas Reddy | ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీలో నేతలు ఎవరికి వారే అన్నట్టుగా కొనసాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు జిల్లాల పరిధిలో  ఉన్న బాన్సువాడ (Banswada) నియోజకవర్గంలో రాజకీయాలు హాట్​హాట్​గా సాగుతున్నాయి.

Pocharam Srinivas Reddy | హాట్​ టాపిక్​గా పోచారం..

ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్​గా మారుతోంది. కొద్దిరోజులుగా బాన్సువాడ నియోజకవర్గంలో చిత్రవిచిత్రమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోకి ఏనుగు రవీందర్ రెడ్డి (Anugu Ravinder Reddy) ఎంట్రీ తర్వాత ఇక్కడి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పడంలో అతిశయోక్తి ఏమి లేదన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఏకంగా పోచారంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పీఏసీ కమిటీ ముందు ధర్నా చేపట్టడం చర్చనీయాంశంగా మారగా అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది.

Pocharam Srinivas Reddy | రసవత్తరంగా బాన్సువాడ రాజకీయం..

బాన్సువాడ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ స్పీకర్, బాన్సువాడలో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్​గా మారింది. అటు బీఆర్ఎస్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు అన్నట్టుగా ఆయన రాజకీయ ప్రస్థానం త్రిశంకులో పడింది. దాంతో అసలు బాన్సువాడలో ఏం జరుగుతోందన్న చర్చ సాగుతోంది. ఒకప్పుడు బాన్సువాడకు పెద్ద దిక్కుగా ఉన్న పోచారం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితిలో ఉండడం కార్యకర్తలను కూడా అయోమయంలోకి నెడుతోంది.

Pocharam Srinivas Reddy | ప్రభుత్వంపై పొగడ్తలు.. నిధులపై విమర్శలు

పోచారం తీరు క్యాడర్​ను తీవ్ర గందరగోళంలోకి నెడుతోంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి తన నియోజకవర్గానికి నిధులు రావడం లేదని బహిరంగ వేదికలపై ఆరోపిస్తున్నారు. సీఎం చెప్పినా మంత్రులు స్పందించడం లేదని, ఫలితంగా పనులు నిలిచిపోతున్నాయని బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు అదే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని కితాబిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటనే ప్రశ్న క్యాడర్​లో వ్యక్తమవుతోంది. ఈ ద్వంద్వ వైఖరి వెనుక ఆంతర్యం ఏమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది ఒత్తిడి పెంచే వ్యూహమా లేక అసంతృప్తికి సంకేతమా అనే చర్చ జరుగుతోంది. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ, అదే ప్రభుత్వ పథకాలను పొగడటం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పార్టీపై కన్ఫ్యూజన్..

అసలు కన్ఫ్యూజన్ అంతా కండువా దగ్గరే మొదలైందన్న చర్చ సాగుతోంది. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, కప్పుకున్నది జాతీయ జెండా కండువా అని పోచారం పలుమార్లు చెబుతూ వస్తున్నారు. తాను కాంగ్రెస్​లో చేరలేదని చెబుతున్నారే తప్ప, తాను బీఆర్ఎస్​లోనే కొనసాగుతున్నానని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. దీంతో ఆయన అసలు ఏ పార్టీలో ఉన్నట్టు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు బీఆర్ఎస్ కాకుండా, ఇటు కాంగ్రెస్ కాకుండా మధ్యలో ఉండడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని విశ్లేషకులు అంటున్నారు.

పార్టీలో ఉంటేనే పదవి..

రాజకీయంగా ఇది తెలివైన స్టెప్​గా కొందరు భావిస్తుంటే, ఇది నమ్మకద్రోహం అని మరికొందరు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు ప్రభుత్వ సలహాదారు పదవిలో ఎందుకు కొనసాగుతున్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారులుగా పార్టీకి చెందిన వారికే అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్​లో లేని వ్యక్తికి ప్రభుత్వ పదవి ఎలా ఇస్తారని, ఇది పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం కాదా అనే ప్రశ్నలను ఏనుగు వర్గీయులు లేవనెత్తుతున్నారు.

పీఏసీ ముందు ధర్నా..

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల నిజామాబాద్​లో జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) మీటింగ్ ముందు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ధర్నాకు దిగడం కలకలం రేపింది. పోచారం వల్ల బాన్సువాడలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పీఏసీ ముందే ధర్నా చేయడం ద్వారా అధిష్టానానికి తమ నిరసనను తెలియజేయాలని వారు భావించినట్లు తెలుస్తోంది.

పోచారంనకు చెక్ పెట్టేలా స్కెచ్..?

ఈ మొత్తం వ్యవహారంలో ఏనుగు రవీందర్ రెడ్డి తెరవెనుక రాజకీయం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బాన్సువాడలో తన రాజకీయ భవిష్యత్తుకు పోచారమే అడ్డుగా ఉన్నారని ఏనుగు భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. పోచారం రాజకీయ జీవితానికి పూర్తిగా చెక్ పెట్టేలా ఏనుగు ప్లాన్ చేస్తున్నారని, ఇందులో భాగంగానే పీఏసీ ముందు ధర్నా చేయించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాన్సువాడలో పట్టు కోసం ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఏనుగు రాజకీయంగా ఎదగడానికి పోచారం అడ్డు తొలగాలని ఆ వర్గం భావిస్తున్నట్టు చెబుతున్నారు.

ఎటూ తేల్చుకోలేని పార్టీ అధిష్టానం

పోచారంపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం లేదనే చర్చ పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది. ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని చెప్పడమే ఇందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు. సస్పెండ్ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, అందుకే అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోందని తెలుస్తోంది. మరోవైపు పోచారం తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుండగా, ఆయన రాకను బీఆర్ఎస్​లో కూడా వ్యతిరేకిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్​లో ఉన్నప్పుడే ఆయన వల్ల నష్టపోయామని ఆ పార్టీ నేతలు అంటున్నట్టు సమాచారం. దీంతో పోచారం పరిస్థితి తేల్చుకోలేకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

క్యాడర్​లో గందరగోళం..

అధిష్టానం డైలమాలో ఉండడం, ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో బాన్సువాడ క్యాడర్​లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరిని నమ్మాలో, ఎటు వెళ్లాలో తెలియక స్థానిక నాయకులు, కార్యకర్తలు సతమతమవుతున్నారు. పోచారం వెంట ఉండాలా, ఏనుగు వెంట నడవాలా అనే అయోమయంలో పడ్డారు. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఈ త్రిశంకు పరిస్థితికి ఎప్పుడు తెరపడుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే బాన్సువాడ రాజకీయం రసవత్తరంగా మారింది.

ఇది కూడా చదవండి: Hafiz Saeed | హఫీజ్ సయీద్‌పై ఉచ్చు బిగిస్తున్న భారత్.. పహల్గామ్ కేసులో న్యాయ–దౌత్య వ్యూహం ఏంటి?

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *