Ramachander Rao Protest | దీక్షలో అస్వస్థతకు గురైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ramachander Rao Protest | తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ( BJP )రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన నిధులను తక్షణమే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘ఫీజు బకాయి-భాజపా లడాయి’ పేరుతో బీజేపీ నేతలు ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ పోరాటానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, పాయల్‌ శంకర్‌, రామారావు పటేల్‌ తదితర ప్రముఖులు మద్దతు తెలిపారు.

Ramachander Rao Protest | పడిపోయిన రక్తపోటు..

దీక్షా శిబిరంలో సుదీర్ఘ గంటల పాటు ఆహారం, నీళ్లు లేకుండా కూర్చోవడంతో మధ్యాహ్న సమయానికి రామచందర్ రావు ఆరోగ్యం మందగించింది. ఆయన నిరసించిపోవడంతో వెంటనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయన రక్తపోటు (BP) 90/60కి పడిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నందున వెంటనే విశ్రాంతి తీసుకోవాలని, దీక్షను విరమించాలని వైద్య బృందం సూచించింది. పార్టీ ముఖ్య నేతల విజ్ఞప్తి మేరకు ఆయన తన నిరాహార దీక్షను విరమించనున్నారు.

Ramachander Rao Protest | కొనసాగనున్న విద్యార్థుల పోరాటం..

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లించే వరకు విద్యార్థుల తరఫున బీజేపీ పోరాటం ఆగదని, భవిష్యత్తులో ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. విద్యార్థులకు మేలు జరిగే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలిపారు.

ఇది కూడా చదవండి: urmeric Farmers Honoured | పసుపుబోర్డు కార్యాలయంలో రైతులకు గవర్నర్​ సన్మానం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *