అక్షరటుడే వెబ్డెస్క్: Social Reformers India | భారత చరిత్రలో శతాబ్దాలుగా పేరుకుపోయిన కుల వ్యవస్థ, అంటరానితనం, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఎందరో మహనీయులు శ్రమించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha )పేర్కొన్నారు. ముఖ్యంగా సాంప్రదాయక అగ్రవర్ణాల్లో లేదా ఉన్నత కుటుంబాల్లో జన్మించినా.. తమ సామాజిక హోదాను పక్కనపెట్టి దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం పోరాడిన చారిత్రక పురుషుల పాత్ర మరువలేనిదని ఆమె ఒక ప్రత్యేక వ్యాసంలో గుర్తుచేసుకున్నారు.
Social Reformers India | ప్రాచీన, మధ్యయుగాల సంస్కర్తలు..
గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే రాజ కుటుంబాలను వదులుకుని సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విప్లవాన్ని తెచ్చారు. పుట్టుకతో ఎవరూ గొప్పోళ్లు కాదని, కరుణ, జ్ఞానమే మనిషి విలువను నిర్ణయిస్తాయని వారు చాటిచెప్పారు. మధ్యయుగంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా బసవణ్ణ కులం, వృత్తి ఆధారిత వివక్షను తీవ్రంగా వ్యతిరేకించి, శ్రమకు గౌరవం ఇస్తూ వీరశైవాన్ని ప్రచారం చేశారు. అలాగే కాయస్థ కులానికి చెందిన స్వామి వివేకానంద అంటరానితనాన్ని ఖండిస్తూ, దళితుల అభ్యున్నతికి విద్య, ఆధ్యాత్మిక సమానత్వం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు.
Social Reformers India | సామాజిక విప్లవం..
ఆధునిక భారతంలో సామాజిక విప్లవం కోసం కొల్హాపూర్ మరాఠా రాజవంశానికి చెందిన ఛత్రపతి రాజర్షి సాహూ మహారాజు 1902లోనే సంస్థాన ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించారు. అలాగే తమిళనాడులో శ్రీరామలింగ స్వామి సమభావాన్ని ప్రచారం చేయగా, తెలుగు రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు గిరిజనులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి విముక్తి కోసం పోరాడారు. వీరితో పాటు మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, దయానంద సరస్వతి, ఆచార్య వినోబా భావే, గురజాడ అప్పరావు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహనీయులు తమ జన్మతః వచ్చిన భావజాలాన్ని పక్కనపెట్టి సమాజ మార్పునకు అంకితమయ్యారని కవిత తన వ్యాసంలో కొనియాడారు.
ఇది కూడా చదవండి: Turmeric Farmers Honoured | పసుపుబోర్డు కార్యాలయంలో రైతులకు గవర్నర్ సన్మానం