అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Andhra University | విద్యా కుసుమాల నిలయం, ఉత్తరాంధ్ర గర్వకారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) వందేళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రాత్మక శతాబ్ది మహోత్సవాలు విశాఖ వేదికగా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP RadhaKrishnan), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో పాటు క్రీడా, సినీ రంగ ప్రముఖులు సచిన్ టెండూల్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని సందడి చేశారు.
Andhra University | దేశ రాజకీయాలకు ఏయూ దిక్సూచి
ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఏయూ వందేళ్ల ప్రయాణం సమాజానికి దిశానిర్దేశం చేసిందని కొనియాడారు. “నాణ్యమైన విద్యకు ఈ విశ్వవిద్యాలయం చిరునామాగా నిలిచింది. ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు దేశ రాజకీయాల్లో, ఉన్నత పదవుల్లో రాణిస్తూ వర్సిటీ ఖ్యాతిని చాటుతున్నారు. భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని మైలురాళ్లు అధిగమించాలి” అని ఆయన ఆకాంక్షించారు.
విశాఖ అభివృద్ధి అన్‌స్టాపబుల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) ప్రసంగిస్తూ ఏయూ విశిష్టతను గుర్తు చేసుకున్నారు. తొలి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి వేసిన పునాదులు, రెండో వీసీగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎదగడం ఏయూ గర్వకారణమని పేర్కొన్నారు. విశాఖపట్నం ఇకపై గ్లోబల్ సిటీగా ఎదుగుతుందని, దీని అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
ఆర్థిక చేయూత: విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రూ. 500 కోట్లతో కార్పస్ ఫండ్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 58 దేశాల విద్యార్థులు విద్యనభ్యసించడం గర్వించదగ్గ విషయమన్నారు.
Andhra University | రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణం
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ఏయూ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. “ఈ గొప్ప విద్యాలయంలో చదువుకునే అవకాశం నాకు రానందుకు బాధపడుతున్నాను. ఎందరో దాతల త్యాగాలు, కష్టం వెనుక ఈ విశ్వవిద్యాలయ వైభవం ఉంది. ఇది కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణం” అని అన్నారు.
Andhra University | ప్రముఖుల సందడి
ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాను కూడా ఏయూ విద్యార్థినేనని గర్వంగా చెప్పుకున్నారు. విభిన్న భావజాలం ఉన్న వారిని ఏకం చేసే గొప్ప వేదిక విశ్వవిద్యాలయమని ఆయన వ్యాఖ్యానించారు. క్రికెట్ దిగ్గజం సచిన్, దర్శకుడు త్రివిక్రమ్ రాకతో ఏయూ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
దీనిని కూడా చదవండి : RTC Diesel Crisis | ఆర్టీసీపై డీజిల్ కొరత ప్రభావం.. అధికారులపై మంత్రి సీరియస్!

