అక్షరటుడే వెబ్‌డెస్క్: PG Medical Students | ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh )పీజీ వైద్య విద్యార్థుల విధులు, సెలవులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. పీజీ వైద్యులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
PG Medical Students | పని గంటలు..
రాత్రి వేళల్లో (నైట్ డ్యూటీ) పనిచేసిన పీజీ వైద్య విద్యార్థులకు మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలి. ప్రతి వారం ఒక రోజు పూర్తిస్థాయిలో సెలవు కల్పించాలని డీఎంఈ స్పష్టం చేశారు. ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
PG Medical Students | ప్రత్యేక చర్యలు..
పీజీ వైద్య విద్యార్థులపై పెరుగుతున్న పని భారం, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా విద్యార్థుల కోసం క్రమం తప్పకుండా కౌన్సెలింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ సెషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
PG Medical Students | సెలవుల వివరాలు..
వైద్య విద్యార్థులకు లభించే సెలవుల విషయంలో డీఎంఈ స్పష్టతనిచ్చారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి 20 రోజుల పెయిడ్ క్యాజువల్ లీవులు ఉంటాయి. అదనంగా 5 రోజుల అకడమిక్ లీవులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు సంవత్సరానికి 52 వారాంతపు సెలవులు కూడా కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Tadkol Chowrasta Safety | బాలిక మృతితో స్పందించిన అధికారులు.. ప్రమాదాల నివారణకు చర్యలు