అక్షరటుడే, బాన్సువాడ: Tadkol Chowrasta Safety | పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనతో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చౌరస్తా వద్ద రహదారి భద్రతను మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతోంది.
Tadkol Chowrasta Safety | అడ్డంకులను తొలగించే పనులు..
ఇందులో భాగంగా ప్రమాదాలకు కారణమవుతున్న అడ్డంకులను గుర్తించి తొలగించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ప్రమాదం జరిగిన అనంతరం ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, పట్టణ సీఐ తుల శ్రీధర్ తాడ్కోల్ చౌరస్తా (Tadkol Chowrasta)ను పరిశీలించారు. చౌరస్తా మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు వాహనదారులకు సరిగా కనిపించకపోవడానికి పలు కారణాలను గుర్తించారు. రహదారికి ఆనుకుని ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం, డివైడర్, రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన షెడ్లు, తోపుడు బండ్లు, ఫ్లెక్సీలు ట్రాఫిక్ రాకపోకలకు ఆటంకంగా మారుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అడ్డంకులను తొలగించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో రహదారి విస్తరణ చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
Tadkol Chowrasta Safety | రోడ్డు పక్కన ఆక్రమణలు
జేసీబీల సాయంతో శనివారం రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలు, ఇతర అడ్డంకులను తొలగించే పనులు ప్రారంభించారు. చౌరస్తా వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద హెచ్చరికలు తెలిపే సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. పట్టణంలో ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలను గుర్తించి దశలవారీగా తొలగించి రహదారులను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Rusty Spotted Cat | రోడ్డు ప్రమాదంలో అరుదైన పిల్లిజాతి జంతువు మృతి